క‌మిష‌న‌రేట్‌ల‌లో పూర్తిగా కేసీఆర్ ప్రైవేటు సైన్యం పని చేస్తోంది: రేవంత్ రెడ్డి

క‌మిష‌న‌రేట్‌ల‌లో పూర్తిగా కేసీఆర్ ప్రైవేటు సైన్యం పని చేస్తోంది: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్లలో పూర్తిగా కేసీఆర్ ప్రైవేటు సైన్యమే పని చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. త‌న సొంత సామాజిక వ‌ర్గం వారికి, పోలీసు వ్యవస్థలో ప్రైవేటు సైన్యంగా పని చేసే వారికే కేసీఆర్ ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

“ప్రభాకర్ రావు (ఐజీ-ఎస్ఐబి), వెంకటేశ్వరరావు (డిఐజీ), రాధాకిషన్ రావు (డీఎస్పీ-టాస్క్ ఫోర్స్) ఈ ముగ్గురూ నెలాఖరుకు రిటైరవుతున్నార‌ని, వీరినీ తిరిగి కొనసాగించడానికి ఫైల్ సిద్ధం చేశారని” రేవంత్ అన్నారు. 15 ఏళ్ల క్రితం రిటైర్ మెంట్ అయిన త‌న సొంత సామాజికవర్గం వాళ్లను తీసుకువచ్చి కేసీఆర్ కీలక పోస్టుల్లో నియ‌మించాడ‌న్నారు. పోలీసు శాఖలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజికవర్గాలకు చెందిన సమర్థవంతమైన అధికారులు లేరా? కేసీఆర్ సామాజికవర్గం వారికి పెద్దపీఠ వేసి… మిగతా వారికి అన్యాయం చేస్తారా? అని అడిగారు. రిటైరవుతోన్న ముగ్గురు అధికారులకు కొనసాగింపు ఇస్తే కోర్టులో కేసు వేస్తానని రేవంత్ అన్నారు.

“పోలీసు వ్యవస్థలో ప్రైవేటు సైన్యంగా పని చేసేవారికి, సొంత సామాజికవర్గం వారికి మాత్రమే పెద్దపీట వేస్తారా? ఫోన్ ట్యాపింగ్ లు, ప్రత్యర్థులను వేధించేవారికి మాత్రమే పోస్టింగులా!?” అని రేవంత్ ప్ర‌శ్నించారు. రాష్ట్ర డీజీపీ కేవ‌లం ఉత్సవ విగ్రహంగా మాత్రమే ఉన్నారన్నారు. వీకే సింగ్ ముందుగానే రిటైర్మెంట్ తీసుకోవడం ప్రాధాన్యత కలిగిన అంశమ‌ని చెబుతూ… ఈ ప్రభుత్వంలో తాను కొనసాగలేనని కేంద్రానికి లేఖ రాశారన్నారు. వీకే సింగ్ ప్రమోషన్ పై సీఎస్ కు లేఖ రాస్తే ఉలుకుపలుకు లేదని రేవంత్ మండిప‌డ్డారు.