CM తీరుతో మంత్రివర్గంలో చీలిక వచ్చింది: ఎంపీ రేవంత్ రెడ్డి

CM తీరుతో మంత్రివర్గంలో చీలిక వచ్చింది: ఎంపీ రేవంత్ రెడ్డి
  • ♦ కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముళ్లు గుచ్చితే నోటితో తీస్తానన్నారు
  • ♦ సమ్మె చేస్తున్న కార్మికుల  గుండెల్లో గునపం గుచ్చుతున్నారు
  • ♦ ప్రగతి భవన్ లో హస్కి అనే కుక్క చనిపోతే సంబంధిత డాక్టర్లపై కేసులు పెట్టారు
  • ♦  కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకండి… మీకు మేము అండగా ఉంటాము 
  • 21న ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం
  • ఎంపీ రేవంత్ రెడ్డి కామెంట్స్

ఆర్టీసీ కార్మికులు  11 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. టీఎంయూ గౌరవ అధ్యక్షుడు హరీష్ రావు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోవడం వల్లే.. నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్నారన్నారు.  ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముళ్ళు గుచ్చితే నోటితో తీస్తానన్న సీఎం కేసీఆర్.. వాళ్ళ గుండెల్లో గునపం గుచ్చుతున్నారని మండిపడ్డారు. అధికార మదంతో ఆర్టీసీ ఉద్యమాన్ని అణచి వేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన హరీష్ రావు, ఈటల రాజేందర్ ఆర్టీసీ సమ్మెపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్ నిర్ణయంపై మంత్రి వర్గంలో చీలిక వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. బీటీ(బంగారు తెలంగాణ) బ్యాచ్ ఆర్టీసీ సమ్మె ను వ్యతిరేకిస్తుంటే యూటీ(ఉద్యమ తెలంగాణ) బ్యాచ్ ఆర్టీసీ సమ్మె ను సపోర్ట్ చేస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్  కేశవరావుకు కూడా కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకడం లేదంటే పార్టీలో చీలిక వచ్చినట్లేనని అన్నారు. టీఎన్జీవో, టీజీవో నాయకులు ప్రజల పక్షమా కేసీఆర్ పక్షమా తేల్చుకోవాలని సూచించారు.

ప్రగతి భవన్ లో హస్కి అనే కుక్క చనిపోతే సంబంధించిన డాక్టర్లపై కేసులు పెట్టారన్న రేవంత్ .. పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు బరి తెగించి మాట్లాడడం వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. అందుకే మంత్రులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ  కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు రేవంత్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి పీఎఫ్, సీపీఎస్ అమలు చేయాలన్నారు. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ప్రతీ కార్యక్రమానికి  కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్న రేవంత్ ..పార్టీ ఆధ్వర్యంలో 21న ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.