సీఎం కేసీఆర్ మాయలోడు.. డబుల్ బెడ్రూంల కోసం ఉద్యమం చేస్తా: రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ మాయలోడు.. డబుల్ బెడ్రూంల కోసం ఉద్యమం చేస్తా: రేవంత్ రెడ్డి

ఖైరతాబాద్ వెలుగురాష్ట్రంలో డబుల్​ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని అత్యవసర పరిస్థితి గా గుర్తించి, ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని సీఎం కేసీఆర్​ను మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. ఈనెల చివరి వరకు డబుల్​ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే ఏప్రిల్​ మొత్తం ఆందోళనలు చేపడుతామన్నారు. కలెక్టర్లేట్లు, ప్రగతి భవన్​ను ముట్టడిస్తామని, ఇందిరాపార్క్​ వద్ద దీక్షలు చేపడుతామని, పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ‘‘పట్నంలో డబుల్​ బెడ్రూంలు పూర్తయినయని పల్లెల్లో చెప్తడు. పల్లెల్లో పూర్తి చేసినట్లు పట్నంలో చెప్తడు. కేసీఆర్  మాయలోడు. అక్కడున్నోళ్లకు ఇక్కడ.. ఇక్కడున్నోళ్లకు అక్కడ అబద్ధాలు చెప్తడు” అని విమర్శించారు. ఆదివారం మల్కాజ్​గిరి లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని భూదేవి నగర్, కూకట్ పల్లి, సాయిబాబా నగర్, కనిగిరి గుట్ట, మల్లాపూర్ ప్రాంతాలకు చెందిన డబుల్ బెడ్రూం ఇండ్ల బాధితులతో కలిసి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో రేవంత్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాల్లో ‘పట్నం గోస’ పేరుతో  పర్యటన చేపట్టామని, అనేక మంది ఇల్లు లేక, కనీసం బాత్రూంలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లుగా పోలుస్తూ, డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని డబుల్​ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయించింది? ఎన్ని ఇండ్లలో ప్రవేశాలు చేయించింది? లెక్క చెప్పాలి” అని డిమాండ్​ చేశారు. సర్వరోగ నివారిణిలా టీఆర్​ఎస్​  ప్రభుత్వం అన్ని ఎన్నికలకు డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని వాడుకుంటోందని విమర్శించారు.

కేటీఆర్​ సమాధానం చెప్పాలి

పట్టణ ప్రగతి పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. డబుల్ బెడ్రూం ఇండ్ల ఊసెందుకు ఎత్తడం లేదో సమాధానం చెప్పాలని రేవంత్​రెడ్డి డిమాండ్ చేశారు. ఇండ్ల కేటాయింపులో కేటీఆర్ సమీప బంధువు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వచ్చినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలోని బాధితులు 250 కిలోమీటర్లు సొంత ఖర్చులతో ప్రయాణించి ప్రగతి భవన్, తెలంగాణ భవన్ వద్ద ధర్నా చేసే దుస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. నాబార్డు నుంచి వచ్చిన నిధులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు దారి మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దిల్​సుఖ్​నగర్ సమీపంలోని ముసరాంబాగ్​లో ఇండ్ల నిర్మాణం పూర్తయి 4 నెలలు కావస్తున్నా కేవలం కేటీఆర్ ప్రారంభించాలన్న ఒకే ఒక్క ఆలోచనతో ఇప్పటివరకు ప్రారంభించలేదని విమర్శించారు. కేటీఆర్ కు తీరిక లేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాత్రమే ప్రారంభించడానికి ఆయన ఏమైనా హౌసింగ్ శాఖ మంత్రి కూడా కాదని, స్థానిక ఎమ్మెల్యే అయినా ప్రారంభించాలని సూచించారు.

కేంద్రం ఇచ్చిన ఇండ్లకు రంగు లేసి..

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సికింద్రాబాద్​లోని ఇండ్లను రంగులేసి తామే నిర్మించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాలు చేస్తోందని రేవంత్​ విమర్శించారు. రాష్ట్రంలోని పేదల బతుకులు ఆగమయ్యాయని, ఎక్కడ చూసినా ప్రభుత్వ ఆర్భా టాలు, ఆరాటాలు తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్​ ప్రకటించిన 2 లక్షల ఎనభై రెండు వేల  డబుల్ బెడ్రూం ఇండ్లలో కేవలం మూడు వేల ఎనిమిది  వందల ఎనభై రెండు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. ఇంటి అద్దెలు భరించలేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని,  ప్రభుత్వం తొందరగా డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు.