సెక్రటేరియట్ కూల్చివేత…‌ నిజాం నవాబ్ నిధులు కోసమేనా.?

సెక్రటేరియట్ కూల్చివేత…‌ నిజాం నవాబ్ నిధులు కోసమేనా.?

సెక్రటేరియట్ భవనాలను అర్ధరాత్రి సమయంలో కూలగొట్టడంలో ఆంత‌ర్య‌మేంట‌ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సెక్రటేరియట్ ను అర్థ రాత్రి కూల్చివేయ‌డం.. నిజాం నవాబ్ నిధులు కోసమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సచివాలయాన్ని కూల్చొద్దని జూన్ 29న తాము కోర్టుకు వెళ్లామని, అయితే సచివాలయం కూల్చడానికి అభ్యంతరం లేదంటూ హైకోర్టు తీర్పునిచ్చిందని రేవంత్ పేర్కొన్నారు. తాము కోర్టును ఆశ్రయించినప్పటి నుంచి కేసీఆర్ కనిపించకుండా పోయారని, జులై 10న కూల్చివేతపై కోర్టు స్టే ఇవ్వగా.. ఆ మరుసటి రోజే మళ్లీ కేసీఆర్ బయటకు వచ్చారని చెప్పారు. ఈ 11 రోజులు కేసీఆర్ ఎక్కడికి పోయారో చెప్పాలని, దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని రేవంత్ అన్నారు.

132 ఏండ్ల కింద కట్టబడిన స‌చివాల‌యంలోని G బ్లాక్, సైపాబాద్ ప్యాలెస్ లో నిజాం ఖజానా ఉంద‌నే అనుమానాలు ఉన్నాయని.. ఈ విషయాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ధ్రువీకరించిందన్నారు రేవంత్ . విద్యారణ్య స్కూల్లో తవ్వకాలు చేసినప్పుడు నిజాం సంబంధించిన ఖజానా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గతంలో పత్రికలు కూడా ఖ‌జానా ఉంద‌నే ప్రచురించాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.మింట్ కాంపౌండ్, విద్యారణ్య స్కూల్ ఆవరణ, హోమ్ సైన్స్ కాలేజ్‌లో గతంలో సొరంగాలు బయటపడ్డాయని రేవంత్ చెప్పుకొచ్చారు. ఆ సొరంగాల కేంద్రం జి బ్లాక్ కిందకు ఉన్నాయని అప్పట్లో పురావస్తు శాఖ గుర్తించిందన్నారు. అక్కడ అన్వేషణ కోసం అవకాశం ఇవ్వాలని పురావస్తు శాఖ జీహెచ్ఎంసీకి లేఖ రాసిందని ఆయన గుర్తు చేశారు

“అభివృద్ధి పనులు చేస్తే డే టైం లో చేస్తారు..కానీ సెక్రటేరియట్ బిల్డింగ్ లు రాత్రి ఎందుకు కూల్చివేత పనులు చేపట్టారు..? “అని ప్ర‌శ్నించారు రేవంత్. స‌చివాల‌యాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఎందుకు కూల్చడం లేదన్నారు. “మూడు కిలో మీటర్ల పరిధిలో ట్రాపిక్ ఆంక్షలు ఎందుకు? ప్రజల్ని ఇబ్బందులు పెట్టుడు ఎందుకు?” అన్నారు. పొక్రాన్ అణుబాంబు పరీక్ష కూడా ఇంత సీక్రెట్ లేదని.. రాకెట్ ప్రయోగల్లోనూ ఇంత గోప్యతా పాటించ‌రన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్,డీజీపీ మహేందర్ రెడ్డి లు మాత్రమే సెక్రటేరియట్ కూల్చివేత లో ఉన్నారని..వీళ్లిద్దరూ సీఎం కేసీఆర్ కు నమ్మినబంటులు అని రేవంత్ అన్నారు.