తండ్రి కొడుకులు దివాలా కోరు రాజకీయాలు మానుకోవాలి: రేవంత్ రెడ్డి

తండ్రి కొడుకులు దివాలా కోరు రాజకీయాలు మానుకోవాలి: రేవంత్ రెడ్డి

అభివృద్ధిలో రాజకీయాలకు సంబంధం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పినట్లుగా సమస్యలు ఎక్కడుంటే అక్కడుంటానని అన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.  గురువారం మల్కాజిగిరిలోని ఆనంద్ బాగ్ ఆర్ యూ బీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ యూ బీ పనులలో భూములను కోల్పోయిన వారిని ఆదుకోడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరిస్తేనే అభివృద్ధి ముందుకు సాగుతుందని అన్నారు. సమస్యలు పూర్తి చేయాలంటే స్థానికుల సహాయంతో ఈ రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయవలసిన అవసరముందని అన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ పాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. తండ్రి కొడుకులు దివాలా కోరు రాజకీయాలు మానుకోవాలన్నారు. పేద ప్రజలకోసం తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.  రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం ఎన్నటికి చెల్లుబాటు కాదని, ఎప్పటికైనా అఖండ భారత దేశంలో బాబా సాహెబ్ రాజ్యాంగమే నడుస్తుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.