
కాగజ్ నగర్, వెలుగు: సీఎం కేసీఆర్ ఫెయిల్యూర్ వల్లనే ఫారెస్ట్ అధికారులు బలవుతున్నారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు మండిపడ్డారు. అడవులు, ఆదివాసీల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్న అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని బండలతో కొడితేనే బుద్ధి వస్తుందన్నారు. గురువారం కాగజ్నగర్ మండలం కదంబలో కుమ్రం భీమ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో బాపూరావు మాట్లాడుతూ.. అధికారులపై దాడులను తాము సమర్థించబోమని, కానీ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లనే దాడులు సాగుతున్నాయని చెప్పారు. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన కుమ్రం భీమ్ ఆశయం ఇప్పటికీ నెరవేరలేదని, స్వాతంత్య్రం వచ్చి 75 యేండ్లయినా పోడు భూముల కోసం ఉద్యమాలు చేయాల్సి వస్తోందన్నారు. ఎన్నికల టైంలో పోడు పట్టాల గురించి సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తనను, ఆదివాసీలను కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.
ఆదివాసీలు ప్రశాంతంగా సాగు చేసుకుంటున్న పోడు భూముల విషయంలో కేసీఆర్ చిచ్చు పెట్టారని, ఎనిమిదేండ్లుగా ఇది రాజుకుంటోందని ఆరోపించారు. ఇప్పటిదాకా ఎన్ని ఎకరాల్లో పోడు సాగు జరుగుతుందో తెల్చలేకపోవడమే ఆదివాసీలు, గిరిజనుల్లో అభద్రతకు కారణమన్నారు. కొత్తగూడెం జిల్లాలో రేంజర్పై గొత్తికోయల దాడి దాని ఫలితమేనన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గు, శరం ఉంటే ఐటీడీఏ పరిధిలో పోడు సర్వే పూర్తయిన 2 లక్షల 40 వేల మందికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నక విజయ్, బీజేపీ లీడర్లు కొంగ సత్యనారాయణ, ఆంజనేయులు గౌడ్, వీరభద్రచారి, కొమురం వందన, కాళిదాస్ మజుందార్, పాల్వాయి హరీష్ బాబు, సర్పంచ్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.