
- బాధితుల నుంచి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు..
- చేతులు మారుతున్న నిర్వాసితుల ప్లాట్లు
- రెవెన్యూ సిబ్బంది కనుసన్నల్లోనే ఫేక్సర్టిఫికెట్లు
- ఆందోళనకు దిగుతున్న బాధితులు
- కలెక్టర్, ఆర్డీవోకు కు ఎంపీ ఉత్తమ్ కంప్లైంట్
సూర్యాపేట : ‘పులిచింతల’ నిర్వాసితుల పునరావాస భూముల్లో భూ దందా సాగుతోంది. అక్రమార్కులు లబ్ధిదారుల నుంచి తక్కువ రేటుకు భూములు కొని ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ఈ వ్యవహారంపై ఇటీవల బాధితులు కలెక్టర్ కు కంప్లైంట్చేయడంతో పాటు అక్రమాలను అరికట్టాలని ఆర్డీవో ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి కూడా అడ్లూరు భూముల్లో అక్రమాలపై కలెక్టర్, ఆర్డీవోలకు కంప్లైంట్చేశారు.
లొసుగులే ఆసరాగా..
పులిచింతల ప్రాజెక్టు ముంపు బాధితులకు పునరావాసం కింద తమ్మవరం, శోభనాద్రి గూడెం, చింతిర్యాల, వెల్లటూరు, రేబల్లె తో పాటు మొత్తం 13 చోట్ల ఆర్అండ్ఆర్ సెంటర్లు అధికారులు కేటాయించారు. అందులో చింతలపాలెం మండలానికి చెందిన అడ్లూరు గ్రామస్తులకు కోదాడ సమీపంలో గుడిబండ వద్ద పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అడ్లూరులో మొత్తం 1,049 ప్లాట్లు ఉండగా అందులో అడ్లూరు వాసులకు 947 కేటాయించారు. 640 ప్లాట్లు లబ్ధిదారులకు ఇప్పటికే అందజేశారు. అలా అక్కడ మిగిలిపోయిన దాదాపు 300 ప్లాట్లపై అక్రమార్కుల కన్ను పడింది. అడ్లూరు సెంటర్ కోదాడకు దగ్గర ఉండటం, బాగా కమర్షియల్ కావడంతో ఇక్కడ భూములకు ఫుల్ డిమాండ్ ఉంది.
లొసుగుల్ని అడ్డం పెట్టుకుని
ఆర్అండ్ఆర్ సెంటర్లలో బాధితులకు ఇచ్చిన భూములను ఒక చోట నుంచి మరో చోటుకు బదలాయించే వెసులు బాటు నిబంధన ఉంది. దీంతో లొసుగుల్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు తెర తీశారు. బాధితుల పేరుతో ఫోర్జరీ సంతకాలతో, నకిలీ ఎన్వోసీలను సృష్టించి తక్కువ రేటు ఉన్న సెంటర్లలో స్థలాన్ని కొనుగోలు చేసి ఎక్కువ రేటు పలికే అడ్లూరుకు బదలాయింపు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్డీవో ఆఫీస్ లో పట్టాలు బదలాయింపు కోసం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రయత్నాలు చేయగా విషయం బయటపడింది. తమ సంతకాలు ఫోర్జరీ చేసి మోసం చేశారని బాధితులు హుజూర్నగర్ ఆర్డీవో ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు.
రెవెన్యూ ఆఫీసర్ల అండదండలతో..
కోదాడ ఆర్డీవో ఆఫీస్, రిజిస్ట్రార్ఆఫీసుల్లోనే నకిలీ డాక్యుమెంట్లు, ఎన్వోసీల, ఫోర్జరీ సంతకాల తతంగం సాగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. హుజూర్నగర్ లో ఆర్డీవో ఆఫీస్ ఏర్పాటు కాకముందే తేదీలు వేసి నకిలీ ఎన్వోసీలను తయారు చేసి ప్లాట్లు అమ్మినట్లు చెబుతున్నారు. గతంలో కోదాడ, పులిచింతల ఆఫీస్ లో పని చేసిన ఇద్దరు ఆఫీసర్లు ప్రస్తుతం హుజూర్ నగర్ ఆర్డీవో ఆఫీస్ లో పనిచేస్తూ గుట్టుచప్పుడు కాకుండా నకిలీ పత్రాలను సృష్టించి పట్టా బదలాయింపు కోసం లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. కాగా కోదాడ నుంచి గుడిబండకు వెళ్లే హైవేకు సమీపంలోనే ఈ ప్లాట్లు ఉండడంతో రియల్టర్లు, అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఈ తతంగానికి తెరలేపినట్లు తెలుస్తోంది. వంద మంది పునరావాస బాధితులకు ఇంత వరకూ ప్లాట్లు కేటాయించలేదని, తమకు దక్కాల్సిన ప్లాట్లను ఇలా దొంగచాటుగా కాజేస్తున్నారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. మరో 11 పట్టాలు బదలాయింపు కోసం ఆర్డీవో ఆఫీస్ లో దరఖాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
అక్రమాలపై ఎంపీ కంప్లైంట్..
అడ్లూరు ఆర్అండ్ఆర్ సెంటర్ ప్లాట్ల అక్రమ బదిలీలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి, హుజూర్ నగర్ ఆర్డీవోకు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్చేశారు. కొందరు వ్యక్తులు తమ్మవరం, శోభనాద్రిగూడెం, చింతిర్యాల, వెల్లటూరు, రేబల్లె ఆర్అండ్ఆర్ సెంటర్లలో తక్కువ రేటుకు కొనుగోలు చేసి భూములు అమ్మిన వ్యక్తుల అనుమతి లేకుండా అడ్లూరు ఆర్ అండ్ సెంటర్ లో కేటాయించాలని అప్లై చేసుకున్నారని దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని అడ్లూరు ఆర్అండ్ఆర్ సెంటర్లలో రిజిస్ట్రేషన్లు చేయొద్దని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని
కోరారు.
ఐదేండ్ల తర్వాత మార్చుకునే వెసులుబాటు
బాధితులకు ఇచ్చిన భూములను ఐదేండ్ల తరువాత ఎవరికైనా అమ్ముకోవచ్చు. గతంలో కంటే ప్రస్తుతం భూముల ధరలు బాగా పెరగడంతో డాక్యుమెంట్లు ఫోర్జరీ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 30 ఇంటి స్థలాలను ఒక సెంటర్ నుంచి మరో సెంటర్ కు పట్టా మార్పిడి చేశాం. మరో10 అప్లికేషన్లు ప్రాసెస్ లో ఉన్నాయి. మా ఆఫీసులో ఎలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్లు చేయలేదు. - వెంకట్రెడ్డి, ఆర్డీవో, హుజూర్ నగర్