బీఆర్‌‌ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి  

బీఆర్‌‌ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి  

సూర్యాపేట, వెలుగు:  సీఎం కేసీఆర్‌‌ ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మడం లేదని, బీఆర్‌‌ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం హుజూర్ నగర్‌‌ ఆర్‌‌వో ఆఫీస్‌లో నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌  రూపకల్పన చేసిందే కాంగ్రెస్‌ అని,   24 గంటల ఉచిత విద్యుత్‌ పథకానికి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.  సీఎం స్థానంలో ఉన్న కేసీఆర్‌‌ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.

రైతుబంధు పథకాన్ని దుబారా అని తాను ఎప్పుడు అనలేదని, ఓటమి భయంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియ కంటే ముందే అన్నీ సంక్షేమ పథకాల బకాయిలు   చెల్లించాలని మాత్రమే అడిగానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి పోలీసులను అడ్డంపెట్టుకొని  బడుగు బలహీన వర్గాల ప్రజలను ఇబ్బందులకు ఇబ్బందులు పెట్టాడని మండిపడ్డారు. మండలాలు, గ్రామాలలో ప్రభుత్వ, ప్రైవేటు భూములను తన బంధువులు,  బినామీలుగా ద్వారా కబ్జా చేశాడని ఆరోపించారు.  హుజుర్‌‌ నగర్‌‌లో తాను, కోదాడ తన భార్య పద్మావతి 50 వేల మెజార్టీతో గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.