రామగుండం అంతర్గాం ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ స్థలాన్ని పరిశీలించిన ఏఏఐ.. రెండేళ్లుగా కృషి చేసిన ఎంపీ వంశీ కృష్ణ

రామగుండం అంతర్గాం ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ స్థలాన్ని పరిశీలించిన ఏఏఐ.. రెండేళ్లుగా కృషి చేసిన ఎంపీ వంశీ కృష్ణ

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గపరిధిలోని అంతర్గాం గ్రీన్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ స్థలాన్ని గురువారం ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (ఏఏఐ) ఆఫీసర్లు పరిశీలించారు. ఏఏఐకి చెందిన ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ విభాగం సీనియర్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ అబ్దుల్‌‌‌‌‌‌‌‌ అజీజ్‌‌‌‌‌‌‌‌, టెర్మినల్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ విభాగం డీజీఎం ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ ఉన్నికృష్ణన్‌‌‌‌‌‌‌‌, ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ విభాగం సీనియర్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ మనీశ్‌‌‌‌‌‌‌‌ జోన్వాల్, కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌ నావిగేషన్‌‌‌‌‌‌‌‌ సర్వేలెన్స్‌‌‌‌‌‌‌‌ విభాగం డీజీఎం బానోత్​ శ్రీనివాస్, ఆర్కియాలజీ విభాగం డీజీఎం వఫా పోకూన్జ్, ఆపరేషనల్‌‌‌‌‌‌‌‌ జేఈ ఎన్.సురేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ అంతర్గాంకు వచ్చి ప్రీ ఫీజిబులిటీ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ కోసం అవసరమైన వివరాలు సేకరించారు. 

ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదిత 977 ఎకరాల స్థలానికి సంబంధించిన మ్యాప్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల ఆఫీసర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా సింగరేణి జైపూర్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ నుంచి హైటెన్షన్‌‌‌‌‌‌‌‌ విద్యుత్‌‌‌‌‌‌‌‌ లైన్ల ఎత్తు, ఎన్టీపీసీకి చెందిన చిమ్నీల ఎత్తు, రామునిగుండాల గుట్ట, కుందనపల్లి లంబాడి తండా వద్ద గల గుట్టల గురించి తెలుసుకున్నారు. 

ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదిత స్థలానికి నాలుగు కిలోమీటర్ల పరిధిలో రన్‌‌‌‌‌‌‌‌వేకు అడ్డుగా ఉన్న సింగరేణి హైటెన్షన్‌‌‌‌‌‌‌‌ విద్యుత్‌‌‌‌‌‌‌‌ లైన్లను తొలగించాలని, లేకపోతే అండర్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ ద్వారా లైన్లు వేసుకోవాలని సూచించారు. ప్రీ -ఫీజుబిలిటీ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను కేంద్ర పౌర విమానయాన శాఖకు అప్పగించి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. 

ఎయిర్‌‌పోర్ట్‌‌తోనే అభివృద్ధి : ఎంపీ వంశీకృష్ణ

అంతర్గాం ప్రాంతంలో ఎయిర్‌‌పోర్టు ఏర్పాటైతే అభివృద్ధి జరుగుతుందని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. రామగుండం, గోదావరిఖని సింగరేణి ప్రాంతాలతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎయిర్‌‌పోర్టు ఏర్పాటు కోసం కేంద్రమంత్రి రామ్మోహన్‌‌ నాయుడును రెండేండ్లుగా కలుస్తున్నట్లు తెలిపారు. 

మొదటగా బసంత్​నగర్​ ప్రాంతంలో పరిశీలించిన స్థలంలో భౌగోళికంగా పలు అడ్డంకులు ఉండడంతో ఏఏఐ అధికారులు ఆ లొకేషన్‌‌ను తిరస్కరించారు. అనంతరం తాను చేసిన నిరంతర ప్రయత్నాలతో అంతర్గాంలోని కొత్త స్థలంలో ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి కేంద్రం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చిందన్నారు.