పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'అంబేద్కర్ ప్రీమియర్ లీగ్' క్రికెట్ పోటీలను ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఎంపీకి శాలువాలతో ఘన స్వాగతం పలికి, సన్మానం చేశారు. క్రీడలను ప్రారంభించిన అనంతరం ఎంపీ వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఏపీకి భారీగా నిధులు కేటాయిస్తూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేయడం లేదని నిలదీశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణను ఎందుకు వంచిస్తోందని ప్రశ్నించారు.ఏపీలో 9 విమానాశ్రయాలు ఉంటే, తెలంగాణలో కేవలం ఒకటి మాత్రమే ఉండటం ఏంటని అడిగారు.ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులపై గళమెత్తానని ఆయన గుర్తు చేశారు.
రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం నిధులు కేటాయించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు ఎంపీ వంశీకృష్ణ. గతంలో కాకా వెంకటస్వామి సాధించిన సింగరేణి పెన్షన్ మొత్తాన్ని 10 వేల రూపాయలకు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. సింగరేణి కార్మికులకు ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పార్లమెంటులో ప్రస్తావించినట్లు తెలిపారు.
