ఇండిగో నిర్లక్ష్యం వల్లే విమానాల ఆలస్యం.. ఇండిగోపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ వంశీకృష్ణ

ఇండిగో నిర్లక్ష్యం వల్లే విమానాల ఆలస్యం.. ఇండిగోపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ వంశీకృష్ణ

ఇండిగో విమానాల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సాంకేతిక లోపాల కారణంగా 500కి పైగా విమానాలు రద్దు చేసింది ఇండిగో ఎయిర్ లైన్స్. ముందస్తు సమాచారం లేకుండా విమానాలు రద్దు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఈ క్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇండిగో విమానాల ఆలస్యంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండిగో నిర్లక్ష్యం వల్లే విమానాలు ఆలస్యమయ్యాయని అన్నారు. ఇండిగో తీరుతో 50 వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయని అన్నారు వంశీకృష్ణ. ఇండిగోపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

మనదేశంలోనే అతిపెద్ద ఎయిర్​లైన్స్​ కంపెనీ ఇండిగో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. గురువారం పరిస్థితులు మరింత దిగజారాయి.  దాదాపు 550కిపైగా విమానాలు రద్దవడంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఢిల్లీ నుంచి 95,  హైదరాబాద్ నుంచి 68,  ముంబై నుంచి 118,  బెంగళూరు నుంచి 73 విమాన సర్వీస్‌‌‌‌లు ఆగిపోయాయి. దీంతో ఎంతో మంది ఎయిర్​పోర్టుల్లోనే చిక్కుకున్నారు. 

ఎంక్వైరీ కౌంటర్ల వద్ద క్యూలు కనిపించాయి.  కొన్ని విమానాలు 10 గంటల వరకు ఆలస్యం అయ్యాయి.  దీనిపై ఇండిగో స్పందిస్తూ  ఇక ముందు కూడా విమానాలు ఆలస్యం కావొచ్చని, 2026 ఫిబ్రవరి 10 నాటికి పరిస్థితి పూర్తిగా చక్కబడుతుందని ప్రకటించింది.  విమానాల రద్దుతో టికెట్ల ధరలు చుక్కలనంటాయి.  శుక్రవారం, శనివారం రోజుల్లో ప్రయాణానికి ఢిల్లీ–-బెంగళూరు వన్-వే ఎకానమీ క్లాస్ టికెట్ రూ.11 వేల నుంచి రూ.43 వేలకు పెరిగింది. ముంబై–-కోల్‌‌‌‌‌‌‌‌కతా చార్జీలు రూ.ఎనిమిది వేల నుంచి రూ.19 వేలు వరకు ఉన్నాయి. 

ఇండిగో మంగళవారం 100కిపైగా, బుధవారం 200కు పైగా విమాన సర్వీస్‌‌‌‌లను రద్దు చేసింది. గత నెల రోజుల్లో 1,232 విమాన సర్వీసులను  నిలిపివేసింది.  పుణే ఇండిగో విమానాలు ఎక్కువ సేపు ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లపై ఉండటంతో ఇతర కంపెనీల విమానాలూ ఆలస్యమయ్యాయి. ఇండిగో ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్ బుధవారం 35 శాతం నుంచి 19శాతానికి పడిపోయింది.  కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు ఢిల్లీలో గురువారం హైలెవెల్​ మీటింగ్​లో పరిస్థితిని సమీక్షించారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని ఇండిగోను ఆదేశించారు.  కంపెనీ పనితీరు సరిగ్గా లేదని విమర్శించారు. 

రద్దుకు కారణాలివి...

కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌డీటీఎల్) నిబంధనలు నవంబర్ నుంచి అమలులోకి రావడంతో, పైలట్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఒక పైలెట్‌‌‌‌‌‌‌‌ రోజులో  రాత్రి 12 నుంచి ఉదయం 6  మధ్య  రెండు ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి.  వారంలో  కనీసం 36 గంటలు రెస్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి. నైట్​ డ్యూటీ తరువాత 12 గంటల విరామం​ తప్పనిసరి. పైలెట్లతోపాటు  ఇతర సిబ్బంది సంఖ్య సైతం తగ్గింది. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ లోపం వల్ల కూడా అంతరాయాలు ఏర్పడినట్లు ఇండిగో పేర్కొంది.  చలికాలం రావడం,  ప్రతికూల వాతావరణం,  రద్దీ వల్ల కూడా విమానాలను రీషెడ్యూల్​ చేయాల్సి వచ్చిందని తెలిపింది.  

ఏవియేషన్ మినిస్ట్రీ ఫైర్​..

ఇండిగో పనితీరుపై ఏవియేషన్ మినిస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ లోపాల వలనే  ఈ సంక్షోభం నెలకొందని తెలిపింది.  ‘‘కొంతమంది పైలట్లు డ్యూటీ రోస్టర్‌‌‌‌‌‌‌‌లో లేకపోవడం, మరికొందరు ఇతర ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్ ఇంటర్వ్యూలకు వెళ్లడం వల్ల క్రూ కొరత మరింత పెరిగింది.  ఇండిగోని  అన్‌‌‌‌‌‌‌‌ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌గా  నడుపుతున్నారు”అని  మినిస్ట్రీ వర్గాలు విమర్శించాయి.

సోషల్ మీడియాలో ట్యాగింగ్ 

విమానాల రద్దులు,  ఆలస్యాలపై ఆగ్రహంతో ఉన్న ప్రయాణికులు కొందరు తమ ఫిర్యాదులను సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ 'ఎక్స్'  ద్వారా నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడును ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.   డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇండిగో మేనేజ్​మెంట్​ను పిలిపించి వివరణ కోరింది. 48 గంటల్లో  సమస్యను  పరిష్కరించాలని ఆదేశించింది.