అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న ఎంపీలు

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న ఎంపీలు
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్న లీడర్లు
  • టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​లో ఇదీ పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు లీడర్లు తమకు అనుకూలంగా ఉన్న అసెంబ్లీ స్థానాన్ని డిసైడ్ చేసుకొని దానిపైనే స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. ‘‘అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈసారి నేను ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయం” అంటూ ఆ నియోజకవర్గంలోని అనుచరులకు, ఓటర్లకు సంకేతాలు ఇస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో ఈ పరిస్థితి కనిపిస్తున్నది.

టీఆర్​ఎస్​లో..!
ప్రస్తుత ఎమ్మెల్సీ, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జగిత్యాల కానీ, దుబ్బాక కానీ ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్​ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. జగిత్యాల సెగ్మెంట్​ నిజామాబాద్ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోకి రావడం, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్​కు చెందిన డాక్టర్ ​సంజయ్ కావడం ఆమెకు కలిసి వస్తుందనే చర్చ సాగుతున్నది. పైగా ​ సంజయ్​.. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో సేఫ్ జోన్ అని కవిత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే.. దుబ్బాక కూడా ఆమెకు పూర్తిగా అనుకూలం అని టీఆర్​ఎస్​ లీడర్లు చర్చించుకుంటున్నారు. 

ప్రస్తుతం దుబ్బాక నుంచి బీజేపీ గెలిచినా.. అక్కడ టీఆర్ఎస్ కు సరైన అభ్యర్థి లేకపోవడం, పైగా ఇటు కేసీఆర్, అటు హరీశ్​, ఇంకో వైపు కేటీఆర్  ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆనుకొని ఉండడంతో కవిత ఇక్కడి నుంచి కూడా పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఖమ్మం లేదా పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏదైనా ఒక స్థానం నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు.  ఖమ్మం నుంచే టీఆర్ఎస్ ఎంపీగా పని చేసిన పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఖమ్మం, పాలేరు, కొత్తగూడెంలో ఏదో ఒక స్థానం నుంచి అసెంబ్లీ బరిలో నిలవాలని భావిస్తున్నారు.  మహబూబాబాద్ ఎంపీగా ఉన్న  మాలోతు కవిత... ఈసారి డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా ఈ సెగ్మెంట్​ నుంచే పోటీకి ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. మెదక్ ఎంపీగా కొనసాగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి, నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్​ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.  కరీంనగర్ మాజీ ఎంపీ, ప్రస్తుత ప్లానింగ్ బోర్డు వైస్  చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్​ భూపాలపల్లి లేదంటే వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి నాగార్జునసాగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని యోచిస్తున్నారు.  భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్  భువనగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు.

కాంగ్రెస్​లో..!
మల్కాజ్​గిరి నుంచి ఎంపీగా కొనసాగుతున్న  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈసారి కల్వకుర్తి, కొడంగల్ రెండింటిలో ఏదో ఒక స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. నల్గొండ లోక్​సభ స్థానానికి  ప్రాతినిధ్యం  వహిస్తున్న పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీకి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఈయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. భువనగిరి ఎంపీగా కొనసాగుతున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, లేదంటే భువనగిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని సిద్ధమవుతున్నారు. మాజీ ఎంపీ మధు యాష్కీ హైదరాబాద్​లోని ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లేదంటే నిజామాబాద్ అర్బన్ నుంచి కానీ, నిజామాబాద్​ రూరల్ నుంచి కానీ పోటీ చేయాలని భావిస్తున్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లేదంటే వేములవాడ అసెంబ్లీ స్థానానికి, సికింద్రాబాద్​ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ లేదంటే ముషీరాబాద్  అసెంబ్లీ స్థానానికి, జహీరాబాద్ మాజీ ఎంపీ సురేశ్​ షెట్కార్  నారాయణ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. 

బీజేపీలో..!
సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్ పేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఈయన ఇక్కడి నుంచే పలుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఎంత బీజీగా ఉన్నా... వీలు దొరికినప్పుడల్లా అంబర్ పేట సెగ్మెంట్​లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు.  కరీంనగర్ ఎంపీ, బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ కరీంనగర్ లేదంటే వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్​ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆర్మూర్ నుంచి పోటీకి గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఈ అసెంబ్లీ సెగ్మెంట్​పై స్పెషల్​ ఫోకస్​ పెట్టి  ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆర్మూర్​ నుంచి కుదరకుంటే  హైదరాబాద్​లోని ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీగా కొనసాగుతున్న సోయం బాపూరావు ఈసారి ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు. మహబూబ్​నగర్​ మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి మహబూబ్​నగర్​ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.