పెళ్లి విందులో గొడవ.. ఎంపీటీసీ భర్త దారుణ హత్య

V6 Velugu Posted on Jun 17, 2021

  • జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: పెళ్లి విందులో జరిగిన గొడవలో ఓ ఎంపీటీసీ భర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పడాల రాజారెడ్డి(42), పడాల చిన్న రాజారెడ్డి అన్నదమ్ముల పిల్లలు. రాజారెడ్డి భార్య మమత ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ. కాగా మంగళవారం రాత్రి బంధువులు ఇంట్లో ఒకరోజు ముందుగా ఏర్పాటు చేసిన పెళ్లి విందుకు చిన్నరాజారెడ్డి, స్థానికుడు సుంకె రమేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నరాజారెడ్డి.. రమేశ్​ను మంత్రాలు చేస్తున్నాడని పదేపదే అన్నాడు. ఆగ్రహానికి గురైన రమేశ్​చిన్నరాజారెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. అక్కడున్నవారు ఆపడంతో గొడవ సద్దుమణిగింది. కొద్దిసేపటి తర్వాత రమేశ్ తనని కొట్టాడంటూ చిన్న రాజారెడ్డి తన అన్న రాజారెడ్డికి ఫోన్​చేసి చెప్పాడు. వెంటనే అక్కడికి చేరుకున్న రాజారెడ్డి రమేశ్​పై దాడిచేశాడు. ఈ క్రమంలో రమేశ్ ​పారతో రాజారెడ్డి తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు నిజామాబాద్ లోని హాస్పిటల్​కు తరలిస్తుండగా రాజారెడ్డి దారిలోనే చనిపోయాడు. మృతుని భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు ఫైల్​ చేసినట్లు మెట్​పల్లి సీఐ శ్రీనివాస్ తెలిపారు. 

Tagged murder, Ibrahimpatnam, jagityal, Padala rajareddy, padala mamata, sunke ramesh, fight at marriage, marriage party, MPTC husband murder

Latest Videos

Subscribe Now

More News