- ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కమిషనర్ అంకిత పాండే
కరీంనగర్ టౌన్,వెలుగు: దేశం 2047 వరకు అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థగా ఎదగాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు ఎంఎస్ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) డెవలప్మెంట్ కమిషనర్ అంకితపాండే తెలిపారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ‘కాస్ట్ అండ్ కాంపిటీటివ్ నెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇన్ ఇండియా’ అనే అంశంపై క్లస్టర్ స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఉపాధి, ఉత్పత్తి ఇచ్చే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల అభివృద్ధికి, ప్రభుత్వం అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చిందని తెలిపారు.
వివిధ సంస్థల, పరిశ్రమల ప్రతినిధులు ఎంఎస్ఎమ్ఈలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కార మార్గాలు, సలహాలు సూచనలు ఈ వర్క్ షాప్ ద్వారా తెలియజేయాలని సూచించారు. అనంతరం ఎంఎస్ఎమ్ఈల ఆవశ్యకత, అభివృద్ధి, వస్తువు ధరలు తగ్గించి నాణ్యతగా ఎలా అందించాలి అనే అంశాలపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో స్టేట్ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ సీహెచ్ రవికుమార్, సెబీ డిప్యూటీ మేనేజర్ వీవీఆర్ ప్రసాద్, ఇండస్ట్రీ జేడీ మధుకర్, ఎంఎస్ఎంఈ జేడీ సీఎస్ఎస్ రావు, కేవీఐబీ సీఈవో వెంకటేశ్వర్, ఎల్డీఎం ఆంజనేయులు పాల్గొన్నారు.
