
- డీఎస్సీ 98, 2008 సెలెక్టెడ్ అభ్యర్థులకు ఎంటీఎస్?
- ఆలోచన చేస్తున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీలో నిర్వహించిన డీఎస్సీ 1998, 2008లో ఎంపికై, వివిధ కారణాలతో ఉద్యోగాలు పొందని అభ్యర్థులకు సర్కారు కొంతమేరకైనా న్యాయం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో మాదిరిగానే తెలంగాణలోనూ మినిమమ్ టైమ్ స్కేల్(ఎమ్టీఎస్) ఇచ్చే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే డీఎస్సీ98, 2008 అభ్యర్థుల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎంపికైనోళ్లలో చాలామంది చనిపోగా, మిగిలినవాళ్లకైనా ఉద్యోగం ఇచ్చి ఎంటీఎస్ అమలు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. అయితే నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన కొందరు అభ్యర్థులు హైకోర్టుకు పోగా, వారికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఆ తీర్పును అమలు చేయకపోవడంతో నలుగురు డీఈవోలకు జైలు శిక్ష కూడా పడింది. ఆ తర్వాత దాన్ని ఎత్తేసింది. ఈ క్రమంలో కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఆఫీసర్లు తప్పుడు లెక్కలు ఇవ్వడంతో అర్హులందరికీ టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఎస్సీ 1998, 2008లో అన్యాయానికి గురైనోళ్లు ప్రస్తుతం 3 వేల మంది లోపే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీళ్లందరికీ మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. అయితే సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం డీఎస్సీ98 క్వాలిఫైడ్ క్యాండిడేట్లందరికీ న్యాయం చేయాలని 1998 డీఎస్సీ సాధన సమితి అధ్యక్షుడు కె.శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.