
కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని ముద్రగడ పద్మనాభం తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. కాపు సామాజికవర్గ ప్రజలకు ఉద్దేశించి రాసిన లేఖలో తుని రైల్వేకేసు కొట్టివేసినందున సత్యం జయించిందని సంతోషం వ్యక్తంచేశారు. తన జాతి రిజర్వేషన్ జోకర్ కార్డులా మారినందుకు బాధపడుతున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 2016వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన తనను తీహార్ జైలుకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ రెడీగా పెట్టారని.. బెయిల్ తెచ్చుకోండి..లేదా అండర్ గ్రౌండ్ కి వెళ్ళమని సలహాలు ఇచ్చారన్నారు. ప్రజల్లో మార్పు రావాల్సి ఉందన్నారు. ఉద్యమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఎప్పుడు రాలేదన్నారు. తమ జాతి రిజర్వేషన్ జోకరు కార్డుల అయినందుకు భాధ పడుతున్నానని.. పేదవారి కోసం తాను చేసే ఉద్యమాలు వారి చిరునవ్వే తనకు ఆక్సిజన్ అన్నారు.
అదే చేసి ఉంటే కులంతో పాటు ఉద్యమం కూడా చులకనయ్యే ప్రమాదం ఉండేదన్నారు. అప్పటి డీజీపీకి కూడా ఉత్తరం ద్వారా సమస్త కేసులు నామీద పెట్టుకోండి అని లేఖలో ప్రస్తావించానన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు పాడుచేయమని ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదని ముద్రగడ స్పష్టం చేశారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభంను వైఎస్ఆర్‌సీపీలోకి ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ లేఖలో మాత్రం తన రాజకీయ భవిష్యత్తును త్వరలోనే ప్రకటించనున్నట్టుగా ముద్రగడ పద్మనాభం ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత కల్గించింది