
పండుగ రోజు ఇంటి ముందు పటాకులు కాల్చేటప్పుడు చిన్న గాయం కూడా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. అలానే పెంపుడు జంతువుల్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే... పటాకుల చప్పుడుకి అవి బెదిరిపోతాయి. ఒత్తిడికి లోనవుతాయి. అంతేకాదు వాటికి గాయాలు అయ్యే అవకాశం ఉంది.
పెట్స్‌ని కంటెయినర్లో పెట్టి, సౌండ్ ప్రూఫ్ ఉన్న గదిలో గాలి ఆడేటట్లు ఉంచాలి. లేదంటే కార్డ్బోర్డ్ బాక్స్‌లతో డబ్బాలాగ చేసి వాటిని అందులో దాచాలి. పటాకుల చప్పుడు వినపడకుండా పెంపుడు జంతువుల చెవులకి మఫ్స్ పెట్టాలి. అలానే ఇంట్లోని గాలి కలుషితం కాకుండా ఎయిర్ప్యూరిఫయర్స్ వాడాలి. శబ్దాలు ఇంట్లోకి వెళ్లకుండా తలుపులు, కిటికీలు మూసెయ్యాలి. ఇంటి ముందు పటాకులు కాలుస్తున్నప్పుడు పెట్స్‌ని ఇంట్లోంచి బయటకి రానీయొద్దు. పెట్స్‌ని ఉదయం, సాయంత్రం వాకింగ్ తీసుకెళ్లే అలవాటు ఉంటే కనుక పండుగ రోజు మాత్రం వాటిని ఉదయం మాత్రమే వాకింగ్‌కి తీసుకెళ్లాలి. వాటికి ఇష్టమైన ఫుడ్ పెట్టాలి. టపాకులు కాల్చేంత వరకు అవి ఆడుకునేలా వాటి ముందు పెట్ఫ్రెండ్లీ వస్తువులు పెట్టాలి. దాంతో అవి బయటి శబ్దాలు విని ఒత్తిడికి గురికావు.