
న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా వచ్చే నెల 21న ప్రత్యేక ముహురత్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ప్రకటించింది. ఈ ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు గంటపాటు జరుగుతుంది. గత సంవత్సరం ఇది సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు జరిగింది. ఈ సెషన్ విక్రమ సంవత్ 2082 ప్రారంభాన్ని సూచిస్తుంది. దీపావళి రోజున ముహురత్ సమయంలో ట్రేడింగ్ చేయడంతో సంపద పెరుగుతుందనే నమ్మకం ఉంది.
అక్టోబర్ 21 వ తేది మంగళవారం అయినప్పటికీ ఆ రోజు సాధారణ ట్రేడింగ్ ఉండదు. ముహురత్ ట్రేడింగ్‌లో ప్రీ-ఓపెనింగ్ సెషన్ మధ్యాహ్నం 1:30 నుంచి 1:45 వరకు జరుగుతుంది. ఇండియాలో కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు దీపావళి నాడు శుభదినంగా భావిస్తారు.
ముహురత్ ట్రేడింగ్‌లో పాల్గొనడం వలన సంవత్సరం మొత్తం శుభాలు జరుగుతాయని నమ్ముతారు. అయితే, ట్రేడింగ్ ఒక గంట పాటే ఉండడంతో మార్కెట్‌లో అధిక వోలటాలిటీ కనిపించొచ్చు. ముహురత్ సెషన్‌లో ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వంటి విభాగాల్లో ట్రేడింగ్ జరుగుతుందని ఎన్‌ఎస్‌ఈ స్పష్టం చేసింది.