జమ్మూకశ్మీర్‌లో 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

జమ్మూకశ్మీర్‌లో 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

టెర్రరిస్టులకు నిధులు సప్లై చేసిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ స్పీడప్ చేసింది. జమ్ము, కశ్మీర్‌లోని 14 జిల్లాల్లో 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎన్ఐఏ, సీఆర్‌పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిషేధిత జమాతే ఈ ఇస్లామి సంస్థకు చెందిన సభ్యుల ఇళ్లపై దాడులు జరిపారు. సంస్థపై నిషేధం విధించిన తర్వాత ఆ సంస్థ సభ్యుల కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. వేర్పాటువాద, పాకిస్థాన్ అనుకూల సంస్థ అయిన జమాతే-ఇ-ఇస్లామిపై కేంద్ర ప్రభుత్వం 2019లో నిషేధం విధించింది.

టెర్రర్ ఫండ్ కేసులో గత నెల 31న కూడా కేంద్రపాలిత ప్రాంతంలోని 14 చోట్ల సోదాలు జరిపారు. లష్కర్-ఇ-ముస్తాఫా చీఫ్ హిదయాతుల్లా అరెస్టు నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించారు. పుల్వామా, సోపియాన్, శ్రీనగర్, అనంతనాగ్, జమ్మూ, బనిహాల్, దోడ, రాంబన్ తదితర ఏరియాల్లో సోదాలు చేశారు.