
ములుగు, వెలుగు: జిల్లాలో విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు మొదటి ప్రమాద హెచ్చరిక సందర్భంలోనే అధికారుల సూచనలు పాటించి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కలెక్టర్ దివాకర టీఎస్అన్నారు. గురువారం కలెక్టరేట్ లో విపత్తుల నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న 970 ఇండ్లను గుర్తించామని, యజమానులకు పంచాయతీ సిబ్బంది ద్వారా నోటీసులు ఇస్తామని తెలిపారు. మొత్తం 800 చెరువులు ఉన్నాయన్నారు.
భారీ వర్షాలు కురిస్తే మారేడుగొండ, కంతనపల్లి, పూరేడు చెరువులపై వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ వాటికి గండిపడితే అధికారులకు తెలియజేయాలని సూచించారు. గోదావరి, జంపన్న వాగుకు సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందుగానే పునరావాస కేంద్రాలకు రావాలని చెప్పారు. మొత్తం 58 కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, వాటిలో 15 వేల మంది ఉండొచ్చని తెలిపారు. ఫ్లడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని, 30 కీలక గ్రామాల్లో సేవలందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయని పేర్కొన్నారు. ములుగు ఫ్లడ్ అలర్ట్స్ పేరిట ఒక లింక్ క్రియేట్ చేస్తున్నామని, త్వరలోనే అందరికీ పంపిస్తామన్నారు. డీపీఆర్వో ఎండీ.రఫీక్ తదితరులు పాల్గొన్నారు.