హాస్పిట‌ల్ క్లోజ్: ముగ్గురు డాక్ట‌ర్లు, 26 మంది న‌ర్సుల‌కు క‌రోనా

హాస్పిట‌ల్ క్లోజ్: ముగ్గురు డాక్ట‌ర్లు, 26 మంది న‌ర్సుల‌కు క‌రోనా

దేశంలో క‌రోనా వైర‌స్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే దేశంలో అక్క‌డ‌క్క‌డా పేషెంట్ల‌ను ట్రీట్ చేస్తున్న వైద్య సిబ్బందికి కూడా వైర‌స్ సోక‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఢిల్లీలో ఇలాంటి కేసులు ఒక‌టీ రెండు న‌మోదు కాగా.. ముంబైలో ఏకంగా ఒకే హాస్పిట‌ల్ లో 29 మంది మెడిక‌ల్ స్టాఫ్ కు క‌రోనా పాజిటివ్ రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) అప్ర‌మ‌త్త‌మైంది. ఆ హాస్పిట‌ల్ ను కంటామినేటెడ్ జోన్ గా ప్ర‌క‌టించింది. అక్క‌డ ప‌ని చేసే ప్ర‌తి డాక్ట‌ర్, న‌ర్స్, పేషెంట్లు, వారి అటెండెంట్లు అంద‌రినీ టెస్టు చేయాల‌ని నిర్ణ‌యించింది.

ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు క్లోజ్..

ముంబైలోని వొక్ కార్డ్ హాస్పిట‌ల్ లో ఇటీవ‌ల‌ వైద్య సిబ్బందిలో ఒక‌రికి క‌రోనా సోకింది. అయితే మొత్తం వారం రోజుల గ్యాప్ లోనే వరుస‌గా ముగ్గురు డాక్ట‌ర్లు, 26 మంది న‌ర్సులు వైర‌స్ బారిన‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇంత భారీ సంఖ్య‌లో వైద్య సిబ్బందికి క‌రోనా రావ‌డంతో ఆ హాస్పిటల్ లోకి రాకపోక‌లు నిలిపేశారు అధికారులు. దానిని కంటామినేటెడ్ జోన్ గా ప్ర‌క‌టించి.. లోప‌ల ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ టెస్టులు చేస్తున్నారు. ఆస్ప‌త్రిలో ఉన్న వారంద‌రికీ నెగ‌టివ్ అని వ‌చ్చే వ‌ర‌కు బ‌య‌టి నుంచి ఎవ‌రినీ లోప‌లికి అనుమ‌తించకూడ‌ద‌ని నిర్ణ‌యించారు. వైద్య సిబ్బందికి ఇంత భారీ స్థాయిలో వైర‌స్ ఎలా సోకింద‌న్న దానిపై ద‌ర్యాప్తు చేసేందుకు సీనియ‌ర్ హెల్త్ ఆఫీస‌ర్ నేతృత్వంలో ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు అడిష‌న‌ల్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సురేశ్ కాకాణి.

70 ఏళ్ల వృద్దుడి నుంచి న‌ర్సుకు..

ఓ 70 ఏళ్ల వృద్ధుడు ఈ హాస్పిట‌ల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడ‌ని, అత‌డికి ఈ నెల 27న క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. అత‌డికి వైద్య సేవ‌లు అందించిన ఇద్ద‌రు న‌ర్సుల‌కు కూడా ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. వారి నుంచి ఆస్ప‌త్రిలో చాలా మందికి క‌రోనా వ‌చ్చి ఉండొచ్చని కొంద‌రు డాక్ట‌ర్లు అంటున్నారు. అయితే ఆస్ప‌త్రికి వ‌చ్చిన వృద్ధుడికి వైర‌స్ సోకింద‌ని తెలిసిన త‌ర్వాత కూడా అత‌డికి వైద్య సేవ‌లు అందించిన డాక్ట‌ర్లు, న‌ర్సుల‌ను క్వారంటైన్ చేయ‌డంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ విఫ‌ల‌మైంద‌ని ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. కాగా, దేశంలో క‌రోనా కేసులు అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లోనే న‌మోద‌య్యాయి. ఆ రాష్ట్రంలో దాదాపు 700 మందికి పైగా వైర‌స్ బారిన‌ప‌డ‌గా.. 45 మంది మ‌ర‌ణించారు. ఆదివారం ఒక్క రోజే కొత్త‌గా 200 కేసులు న‌మోద‌య్యాయి.