అదరగొట్టిన ముంబై.. ఐపీఎల్‌‌లో రెండో విక్టరీ

అదరగొట్టిన ముంబై.. ఐపీఎల్‌‌లో రెండో విక్టరీ

ముంబై: అద్భుతమైన బౌలింగ్‌‌తో అదరగొట్టిన ముంబై ఇండియన్స్‌‌.. ఐపీఎల్‌‌లో రెండో విక్టరీని అందుకుంది. లాస్ట్‌‌ ఓవర్‌‌లో 9 రన్స్‌‌ కొట్టాల్సిన టైమ్‌‌లో మిల్లర్‌‌ (19 నాటౌట్‌‌), రాహుల్‌‌ తెవాటియా (3), రషీద్‌‌ ఖాన్‌‌ (1 నాటౌట్‌‌)లాంటి ఫినిషర్లను నిలువరించిన డానియల్‌‌ సామ్స్‌‌ కేవలం 3 రన్స్‌‌ ఇచ్చి ఓ వికెట్‌‌ తీసి సూపర్‌‌ విక్టరీని అందించాడు. దీంతో శుక్రవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ముంబై 5 రన్స్‌‌ తేడాతో గుజరాత్‌‌ టైటాన్స్‌‌కు చెక్‌‌ పెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 177/ 6 స్కోర్ చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (29 బాల్స్ లో 5 ఫోర్లు 1 సిక్సర్ తో 45), కెప్టెన్ రోహిత్ శర్మ (28 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43), టిమ్ డేవిడ్ (21 బాల్స్ లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 నాటౌట్) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ (2/24) రెండు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌‌లో చివరి బంతి వరకు పోరాడిన గుజరాత్ 172/ 5 స్కోర్ చేసి ఓడిపోయింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (40 బాల్స్ లో 6 ఫోర్లు 1 సిక్సర్లతో 55), శుభ్ మన్​ గిల్ (36 బాల్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) చెలరేగారు.  టిమ్​ డేవిడ్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

భారీ స్కోర్ మిస్..

బ్యాటింగ్‌‌కు సహకరించే  పిచ్‌‌పై మొదట బ్యాటింగ్ చేసిన ముంబై బ్యాటర్లు మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇషాన్ కిషన్ తో పాటు రోహిత్ ఈ మ్యాచ్ లో మంచి ఆరంభం అందించాడు. జోసెఫ్ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ తో టచ్ లోకి వచ్చిన హిట్ మ్యాన్ తర్వాతి ఓవర్లోనూ ఓ సిక్సర్​తో తన క్లాస్ షాట్స్ రుచి చూపించాడు. ఇషాన్ ఐదో ఓవర్లో రెండు ఫోర్లతో జోరందుకున్నాడు. కానీ రషీద్ ఖాన్ వేసిన 8వ ఓవర్లో రివర్స్ స్వీప్ కు ప్రయత్నించి రోహిత్ ఔటవడంతో తొలి వికెట్ కు 74 రన్స్ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఆపై ఇషాన్, సూర్యకుమార్ (13) దూకుడుతో 10 ఓవర్లలో 97/1 స్కోర్ చేసిన ముంబై 200 ఈజీగా కొట్టేలా కనిపించింది. కానీ వరుస ఓవర్లలో సూర్య, ఇషాన్ వికెట్లు తీసిన గుజరాత్.. ముంబై బ్యాటర్ల జోరుకు అడ్డుకట్ట వేసింది. తిలక్ వర్మ (21) కాసేపు నిలిచినా.. పొలార్డ్ (4) డేనియల్ సామ్స్ (0) విఫలమయ్యారు. చివర్లో టిమ్ డేవిడ్ మెరుపులతో ఇండియన్స్ మంచి స్కోర్  చేయగలిగింది. 

ఆరంభం అదిరింది

ఛేజింగ్‌‌లో గుజరాత్ ఓపెనర్లు సాహా, గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రెండో ఓవర్లో 4,6తో బౌండ్రీల ఖాతా తెరిచిన సాహా దూకుడు చూపించగా గిల్ అతడికి సపోర్ట్ ఇచ్చాడు. ఆరో ఓవర్లో 6,4తో పాటు 8వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో గిల్ కూడా కుదురుకున్నాడు. దీంతో సగం ఓవర్లకు 95/0తో టైటాన్స్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలోనే వరుస ఓవర్లలో సాహా, గిల్ ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. కానీ 13వ ఓవర్లో వీరిద్దరినీ మురుగన్ అశ్విన్ ఔట్ చేసి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. 16వ ఓవర్లో సాయి సుదర్శన్ (14) హిట్ వికెట్‌‌గా వెనుదిరగడంతో గుజరాత్ విక్టరీకి చివరి 24 బాల్స్ లో 40 రన్స్ అవసరమయ్యాయి. ఈ దశలో రెండు ఓవర్లలో రెండు బౌండ్రీలు బాదిన హార్దిక్​ రనౌట్ కావడంతో  చివరి 12 బాల్స్ లో టైటాన్స్ విక్టరీకి 20 రన్స్ కావాల్సి వచ్చాయి.  ఇక 19వ ఓవర్లో బుమ్రా 11 రన్స్ సమర్పించుకోవడంతో విజయ సమీకరణం ఆఖరి ఓవర్లో 9 రన్స్ గా మారింది. 

సంక్షిప్త స్కోర్లు

ముంబై: 20 ఓవర్లలో 177/6 (ఇషాన్ 45, టిమ్ డేవిడ్ 44 నాటౌట్, రోహిత్ 43, రషీద్ 2/24). గుజరాత్ : 20 ఓవర్లలో 172/5 (సాహా 55, గిల్ 52, ఎం అశ్విన్ 2/29).