బై బై.. ముంబై: ప్లే ఆఫ్స్‌‌కు దూరమైన రోహిత్‌‌సేన

బై బై.. ముంబై: ప్లే ఆఫ్స్‌‌కు దూరమైన రోహిత్‌‌సేన
  • సన్‌‌రైజర్స్‌‌పై నెగ్గినా ప్లే ఆఫ్స్‌‌కు దూరమైన రోహిత్‌‌సేన
  • దంచికొట్టిన ఇషాన్‌‌ కిషన్‌‌, సూర్యకుమార్‌‌
  • మనీశ్‌‌ పాండే పోరాటం వృథా


అబుదాబి:ఐపీఎల్‌‌–14లో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ముంబై ఇండియన్స్‌‌ పోరాటం ముగిసింది. ప్లే ఆఫ్స్‌‌కు చేరాలంటే.. భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌‌లో పరుగుల సునామీ సృష్టించినా అదృష్టం కలిసిరాలేదు. దీంతో శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో ముంబై 42 రన్స్‌‌ తేడాతో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌పై నెగ్గి.. ఇంటిముఖం పట్టింది. ఫలితంగా హ్యాట్రిక్‌‌ టైటిల్స్‌‌ సాధించాలన్న రోహిత్‌‌సేన కల నెరవేరలేదు. కోల్‌‌కతా, ముంబై సమాన పాయింట్లు (14) సాధించినా.. మెరుగైన నెట్‌‌ రన్‌‌రేట్‌‌తో నైట్‌‌రైడర్స్‌‌ నాకౌట్‌‌కు అర్హత సాధించింది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 235/9 స్కోరు చేసింది. ఇషాన్‌‌ కిషన్‌‌ (32 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84) ఈ సీజన్‌‌లో ఫాస్టెస్ట్‌‌ హాఫ్‌‌ సెంచరీ నమోదు చేయగా, సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (40 బాల్స్‌‌లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 82) దడదడలాడించాడు. తర్వాత హైదరాబాద్‌‌ 20 ఓవర్లలో 193/8 స్కోరుకే పరిమితమైంది. మనీశ్‌‌ పాండే (69 నాటౌట్‌‌) టాప్‌‌ స్కోరర్‌‌. ఇషాన్​కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 
ఇషాన్‌‌, సూర్య జోరు.. 
కీలక మ్యాచ్‌‌ కావడంతో రోహిత్‌‌ (18)ను నిలబెట్టి.. ఫస్ట్‌‌ బాల్‌‌ నుంచే ఇషాన్‌‌ పరుగుల సునామీ సృష్టించాడు. హైదరాబాద్‌‌ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 16 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ ఫినిష్‌‌ చేశాడు. ప్రతి ఓవర్‌‌లో బౌండ్రీలు, సిక్సర్ల జాతర చూపడంతో.. ఐదు ఓవర్లలోనే ముంబై స్కోరు 78 రన్స్‌‌కు చేరింది. అయితే ఆరో ఓవర్‌‌లో రషీద్‌‌.. రోహిత్‌‌ను ఔట్‌‌ చేయడంతో తొలి వికెట్‌‌కు 80 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. ఆర్డర్‌‌లో ముందుకొచ్చిన హార్దిక్‌‌ (10) భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యాడు. అయినా ఇషాన్‌‌ జోరు కొనసాగించడంతో ముంబై 7.1 ఓవర్‌‌లో 100/1తో, 9 ఓవర్లలో 124/2తో పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ10వ ఓవర్‌‌లో ఇషాన్‌‌ ఔట్‌‌కావడంతో ముంబై ఇన్నింగ్స్‌‌ డీలా పడింది. కొద్దిసేపటికే  స్పిన్నర్‌‌ అభిషేక్‌‌ శర్మ (2/4).. 13వ ఓవర్‌‌లో పొలార్డ్‌‌ (13), నీషమ్‌‌ (0)ను ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. ఈ దశలో వచ్చిన సూర్యకుమార్‌‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓ ఎండ్‌‌లో సహచరులు విఫలమైనా.. తన ట్రేడ్‌‌మార్క్‌‌ క్రికెటింగ్‌‌ షాట్లతో దంచికొట్టాడు. ఈ క్రమంలో 24 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ కంప్లీట్‌‌ చేశాడు. లాస్ట్‌‌ 5 ఓవర్లలో 58 రన్స్‌‌ రావడంతో ముంబై భారీ స్కోరు సాధించింది. హోల్డర్‌‌ 4 వికెట్లు తీశాడు. 
రాయ్‌‌.. ధనాధన్‌‌
ముంబై నాకౌట్‌‌కు వెళ్లాలంటే హైదరాబాద్‌‌ను171 రన్స్‌‌ తేడాతో ఓడించాల్సిన నేపథ్యంలో.. రైజర్స్‌‌ ఓపెనర్లు జేసన్‌‌ రాయ్‌‌ (34), అభిషేక్‌‌ శర్మ (33) స్టార్టింగ్‌‌ నుంచే దూకుడుగా ఆడారు. ఫస్ట్‌‌ వికెట్‌‌కే 64 రన్స్‌‌ జోడించి రోహిత్‌‌సేన ఆశలపై నీళ్లు చల్లారు. తర్వాత మనీశ్‌‌ పాండే నిలకడగా ఆడినా, నబీ (3), సమద్‌‌ (2) విఫలమయ్యారు. ప్రియమ్‌‌ గార్గ్‌‌ (29) మంచి సహకారం ఇవ్వడంతో హైదరాబాద్‌‌ 9.1 ఓవర్లలో 100 స్కోరుకు చేరింది. ఐదు ఓవర్లు క్రీజులో ఉన్న గార్గ్‌‌ పాండేతో ఐదో వికెట్‌‌కు 56 రన్స్‌‌ జోడించి ఔటయ్యాడు. చివర్లో హోల్డర్‌‌ (1), రషీద్‌‌ (9), సాహా (2) విఫలమయ్యారు. అప్పటికే చేయాల్సిన రన్‌‌రేట్‌‌ పెరిగిపోవడంతో పాండే కూడా ఏం చేయలేకపోయాడు.