ప్రపంచంలో రెండో కాలుష్య నగరం ముంబై

ప్రపంచంలో రెండో కాలుష్య నగరం ముంబై

ఢిల్లీని మించిన కాలుష్యంతో ప్రమాదపు అంచుల్లోకి
ఫస్ట్​ ప్లేస్​లో పాక్​లోని లాహోర్​
‘ఐక్యూ ఎయిర్’ సర్వేలో వెల్లడి

ముంబై : ప్రపంచంలో రెండో అత్యంత కలుషిత నగరంగా ముంబై నిలిచింది. మన దేశంలో మోస్ట్​  పొల్యూటెడ్ సిటీ కూడా ఇదే. స్విట్జర్లాండ్​ కు చెందిన ఎయిర్​ క్వాలిటీ మానిటరింగ్​ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ తాజాగా నిర్వహించిన వీక్లీ సర్వేలో ఈవివరాలు వెల్లడయ్యాయి.  జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 మధ్యకాలంలో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల గాలి నాణ్యతను తనిఖీ చేసి ఎయిర్​ ట్రాకింగ్​ ఇండెక్స్​ను ఐక్యూ ఎయిర్​ రూపొందించింది. ఇంతకుముందు వరకు దేశంలో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ ఉండగా..  ఇప్పుడా స్థానంలోకి ముంబై వచ్చింది. ఆశ్చర్యకరంగా ఈసారి కలుషిత నగరాల టాప్​10 లిస్టులో ఢిల్లీ పేరు లేదు. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్​ సిటీగా పాకిస్తాన్​లోని లాహోర్​ నిలిచింది.

ముంబై తర్వాతి స్థానాల్లో వరుసగా కాబూల్​ (అఫ్ఘానిస్తాన్), కావో హిసియుంగ్​(తైవాన్), బిష్కెక్​ (కిర్గిజ్​స్తాన్), ఆక్రా (ఘనా), క్రాకో (పోలండ్), దోహా (ఖతర్), అస్తనా (కజకిస్తాన్), శాంటియాగో (చిలీ) ఉన్నాయి. ఎయిర్​ క్వాలిటీ సర్వే చేయడంలో ‘ఐక్యూ ఎయిర్’కు యునైటెడ్​ నేషన్స్​ఎన్విరాన్మెంట్​ ప్రోగ్రామ్​(యూఎన్​ఈపీ), గ్రీన్​ పీస్​ సంస్థలు సహకరించాయి. ఈ స్టడీ కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నుంచి కాలుష్యం, గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు.