రైల్లో కాల్పులు జ‌రిపిన కానిస్టేబుల్ ఎవ‌రు.. ఎందుకు కాల్చాడు?

  రైల్లో కాల్పులు జ‌రిపిన కానిస్టేబుల్ ఎవ‌రు.. ఎందుకు కాల్చాడు?

మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్  రైలులో కాల్పులు ఘటన కలకలం సృష్టించింది. ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో  ఏఎస్ఐతో పాటు మరో ముగ్గురు రైల్వే ప్రయాణికులు మరణించారు. అయితే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఎందుకు కాల్పులు జరిపాడన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

ఎందుకు కాల్పులు జరిపాడంటే..?

ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌కు చెందిన వ్యక్తి. అయితే కొన్నాళ్ల పాటు గుజరాత్ లో విధులు నిర్వర్తించాడు. అనంతరం ఇటీవలే ముంబైకి బదిలీ అయ్యాడు. బదిలీ అయి ముంబైకి రావడం చేతన్ సింగ్ కు ఇష్టం లేదు. తనను ఉన్నతాధికారులు బదిలీ చేయడంపై చేతన్ సింగ్ కోపంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలోనే అతను జైపూర్- ముంబై ఎక్స్ ప్రెస్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. 

మాటా మాటా పెరిగి...

తన బదిలీపై ఆర్ఫీఎఫ్ ఏఎస్ఐ టికారామ్ మీనాతో చేతన్ సింగ్ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వీరిద్దరికి కొందరు ప్రయాణికులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన చేతన్ సింగ్..ఒక్కసారిగా ఏఎస్ఐపై కాల్పులు జరిపాడు. దీంతో టికారామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత B5లో ఉన్న మరో ముగ్గురు ప్రయాణికులను కాల్చాడు. వారు కూడా మృతి చెందాడు. అనంతరం బోగిలో నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ రైల్వే పోలీసులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్ట్ం నిమిత్తం కందివాలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలించారు.