ముంబైలో హైఅలర్ట్‌‌.. మానవ బాంబులతో పేలుళ్లు అంటూ మెసేజ్

ముంబైలో హైఅలర్ట్‌‌.. మానవ బాంబులతో పేలుళ్లు అంటూ మెసేజ్
  • మానవ బాంబులతో పేలుళ్లు అంటూ మెసేజ్
  • ట్రాఫిక్ కంట్రోల్ రూమ్​కు వాట్సాప్​లో సందేశం
  • 400 కేజీల ఆర్డీఎక్స్​తో కోటి మందిని చంపుతామని బెదిరింపు
  • 14 మంది పాక్​ టెర్రరిస్టులు ఇండియాలోకి ఎంటర్ అయ్యారు
  • ‘లష్కరే జిహాది’ పేరుతో హెచ్చరిక.. అప్రమత్తమైన  పోలీసులు

ముంబై: ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సిటీలోని పలుచోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడతామని ముంబై ట్రాఫిక్ పోలీసుల కంట్రోల్ రూమ్​కు గురువారం రాత్రి వాట్సప్ మెసేజ్ వచ్చింది. దీంతో సిటీ మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబై సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ‘లష్కరే జిహాది’ పేరుతో ఈ మెసేజ్ వచ్చింది. ‘‘34 వాహనాల్లో హ్యుమన్​ బాంబులు అమర్చాం. పేలుడుతో సిటీ మొత్తం షేక్ అవుతుంది. 14 మంది పాకిస్తానీ టెర్రరిస్టులు ఇండియాలో ఎంటర్ అయ్యారు. బ్లాస్ట్​కు మొత్తం 400 కిలోల ఆర్డీఎక్స్ వాడుతున్నాం. ఈ పేలుళ్లతో కోటి మంది చనిపోతారు’’ అని మెసేజ్​లో ఆగంతకుడు పేర్కొన్నాడు.

రద్దీ ప్రదేశాలపై స్పెషల్ ఫోకస్

శనివారం అనంత్ చతుర్థి సందర్భంగా ముంబైలో శుక్రవారం నుంచే వినాయకుల నిమజ్జన సందడి మొదలైంది. తాజాగా ఈ పేలుళ్ల హెచ్చరికలతో సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ టైట్ చేశారు. సిటీలోకి ఎంటర్ అయ్యే అన్ని ఏరియాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వినాయకుల నిమజ్జనం సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనపు బలగాలను మోహరించారు. కొద్ది రోజులుగా పార్క్ చేసి ఉన్న వాహనాలను చెక్ చేస్తున్నారు. పార్కింగ్ ప్లేసుల్లో రోజుల తరబడి ఉండిపోయిన వాహనాలను పరిశీలిస్తున్నారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ను రంగంలోకి దించి భద్రతా తనిఖీలు చేపట్టారు. అప్రమత్తంగా ఉండాలని ముంబై వాసులను పోలీసులు అలర్ట్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కానీ వాహనాలు కానీ కనిపిస్తే  వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రూమర్లను నమ్మొద్దని, తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.