ముంబైలో భారీ వర్షం.. హాజీ అలీ దర్గాను తాకిన సముద్ర అలలు

ముంబైలో భారీ వర్షం.. హాజీ అలీ దర్గాను తాకిన సముద్ర అలలు

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం అవుతోంది.ఆదివారం(ఆగస్టు 17) ఉదయం ముంబైలోని పలు ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా జలమయమయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో సముద్ర మట్టాలు పెరిగాయి. ప్రధానంగా హాజీ అలీ దర్గా దగ్గర భారీ అలలు ఎగిసిపడ్డాయి. శాంతాక్రూజ్ ప్రాంతంలో భారీ వర్షం కురవడంలో రోడ్లన్నీ నీటమునిగాయి. వర్షపాతం ప్రభావంతో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు  అంతరాయం ఏర్పడింది.

గడిచిన 24 గంటల్లో వర్షపాతం భారీ నమోదు అయింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు ముంబైలో 92.81 మి.మీ వర్షం నమోదైంది. పశ్చిమ శివారు ప్రాంతాలలో 103.98 మి.మీ వర్షం కురిసింది. తూర్పు శివారు ప్రాంతాలలో 78.15 మి.మీ వర్షం నమోదైంది. శనివారం శాంటాక్రూజ్‌లో 24 సెం.మీ వర్షపాతం నమోదైంది.కొలాబాలో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది.

ముంబై, దాని శివారు ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.గంటకు 40-50 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆగస్టు 16 నుంచి 19 వరకు కొంకణ్ ప్రాంతం, గోవా ,మధ్య మహారాష్ట్రలోని ఘాట్లలో మరింత తీవ్రమైన వర్షాలు కురుస్తాయని అంచనా వేయగా రాబోయే వారం వరకు మహారాష్ట్ర, గోవా, గుజరాత్ అంతటా విస్తృత వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.