జల దిగ్బంధంలో ముంబై.. స్తంభించిన జనజీవనం

జల దిగ్బంధంలో ముంబై.. స్తంభించిన జనజీవనం
  • ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. వందలాదిగా నిరాశ్రయులు
  • ప్రధాన రోడ్లన్నింటిపై మోకాళ్ల లోతు నీరు
  • ఎక్కడికక్కడ నిలిచిన వెహికల్స్.. స్తంభించిన జనజీవనం
  • రైళ్లు, విమానాలు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

ముంబై: మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మహారాష్ట్రలోని ముంబై, దాని పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరదల కారణంగా ముంబైలో చనిపోయినవారి సంఖ్య ఆరుకు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లల్లోకి నీరు చేరడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎడతెరిపి లేని కుండపోత వర్షాలతో ముంబైలోని ప్రధాన రోడ్లన్నింటిపై మోకాళ్ల లోతు నీరు చేరింది. దాంతో ఎక్కడికక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెహికల్స్ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొందరు తమ బైకులను మోకాళ్ల లోతు నీటిలోనే తోస్తూ అతికష్టం మీద బయటపడ్డారు. ఇక, కార్లు, ఇతర పెద్ద వాహనాలు అన్ని వరద నీటిలోనే చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలతో కొలాబా, అంధేరీ, బాంద్రా, మలాడ్ వంటి ప్రాంతాల్లో నీరు చేరి రోడ్లు చెరువుల్లాగా మారాయి. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. నిరాశ్రయులైన వందలాది మందిని బోట్లు, ట్రక్కులతో స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లలోకి తరలిస్తున్నారు. భారత వాతావరణ శాఖ  రెడ్ అలర్ట్ జారీచేయడంతో అధికారులు స్కూల్స్, కాలేజీలు మంగళవారం మూసివేశారు.

ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం?

ఐఎండీ, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) డేటా ప్రకారం.. 24 గంటల్లో ముంబై సిటీలోని వివిధ ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. విఖ్రోలిలో 255.5 మి.మీ, చించోలిలో 361 మి.మీ, దాదర్‌‌లో 300 మి.మీ వర్షపాతం నమోదైంది.

పట్టాలపైకి వరద.. నిలిచిన రైళ్లు

భారీ వర్షాలకు ముంబై ట్రాన్స్‌‌పోర్ట్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే ట్రాక్‌‌లపై భారీగా నీరు నిలవడంతో అన్ని లోకల్ ట్రైన్ల సర్వీసులు నిలిపివేశారు. ఇక ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌‌వేలపై నీరు చేరడంతో మంగళవారం 14 విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్ని విమానాలను హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్ వంటి సమీప నగరాలకు మళ్లించారు. రన్‌‌వేలు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌‌పోర్టులోనే చిక్కుకున్నారు. బీఎంసీ, విమానాశ్రయ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి

గడిచిన24 గంటల్లో ముంబైలో 300 మి.మీ వర్షపాతం నమోదైందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. " ముంబైలో కేవలం గడిచిన 8 గంటల్లోనే 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో సుమారు 300 మి.మీ వర్షపాతం నమోదైంది. రాబోయే రోజుల్లో మరింత వర్షం పడే అవకాశం ఉంది. అందుకే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. రాబోయే 48 గంటలు ముంబైకి చాలా కీలకం" అని పేర్కొన్నారు.

అండర్‌‌పాస్ వద్ద వరదలో కారు

 భారీ వర్షాల కారణంగా థానే జిల్లాలోని నారివాలి, ఉత్తర్‌‌శివ్ గ్రామాలను కలిపే అండర్‌‌పాస్ వద్ద భారీగా నీరు నిలిచింది. ఆ నీటిలో ఇద్దరు ప్రయాణికులతో కూడిన కారు ప్రమాదవశాత్తు చిక్కుకుపోయింది. స్థానిక యువకులు ఈదుకుంటూ వెళ్లి కారును ముందుకు తోశారు.  అందులోని ఇద్దరూ బయటకు వచ్చేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.