
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. వెస్ట్రన్ సబ్ అర్బన్ కు చెందిన కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఐదు గంటల్లో 50 మీమీలకు పైగా వర్షపాతం నమోదైంది. జుహులో 88 మీమీ, బాంద్రాలో 82.5 మీమీ వర్షపాతం రికార్డైంది. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వేకు చెందిన స్థానిక రైలు సర్వీసులు కొంత ఆలస్యంగా నడిచాయి.
బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై, ట్రాన్స్ పోర్ట్ (బీఈఎస్ టీ) సంస్థ బస్సులన్ని యథావిధిగా నడిచాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎమ్ సీ) సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘సిటీ, సబర్బన్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు పేరుకుపోయే అవకాశం ఉంది. రెస్క్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచాం” అని తెలిపింది.