డెల్టా ప్లస్ వేరియంట్ తో ముంబైలో తొలి మరణం

డెల్టా ప్లస్ వేరియంట్ తో ముంబైలో తొలి మరణం

కరోనావైరస్ తో మహారాష్ట్ర మొత్తం అతలాకుతలం అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకునేలోపే.. మళ్లీ అక్కడ డెల్టా కేసులు ఎక్కువయ్యాయి. అది తగ్గేలోపే డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తోంది. తాజాగా ముంబైలో డెల్టా ప్లస్ వేరియంట్ తో తొలి మరణం సంభవించింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ప్రకారం.. గత నెలలో జూలై 21న కోవిడ్ భారిన పడిన 63 ఏళ్ల మహిళకు డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ సోకింది. దాంతో ఆమె ఆరోగ్యం క్షీణించి జూలై 27న మరణించింది. ఈ కేసు డెల్టా ప్లస్ వైరస్ వల్ల నమోదైన మొదటి మరణమని ముంబై అధికారులు తెలిపారు. మరణించిన మహిళ ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుందని.. అయితే ఆమెకు గతంలోనే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ ఉందని వైద్యులు తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యుల్లో ఆరుగురు కరోనా బారినపడ్డారు. వారిలో ఇద్దరికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ మరణం ఇది రెండవది. గతంలో రత్నగిరికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు డెల్టా ప్లస్ వేరియంట్‌తో చనిపోయింది. ఆమె మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వల్ల చనిపోయిన మొదటి వ్యక్తి.