గంటా 25 నిమిషాల పాటు మునావర్ ఫారూఖీ షో

గంటా 25 నిమిషాల పాటు మునావర్ ఫారూఖీ షో

హై టెన్షన్ మధ్యే మునావర్ షారూఖీ కామెడీ షో ముగిసింది. భారీ భద్రత, ఆందోళనలు, నిరసనల మధ్య శిల్పకళావేదికలో  గంటా 25 నిమిషాల పాటు మునావర్ ఫారూఖీ స్టాండ్ అప్ కామెడీ షో జరిగింది. షోకు యువత, ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొత్తం 2 వేల మంది షో ను వీక్షించారు. షో మాత్రం బాగుందని అడియన్స్ రెస్పాన్స్ ఇచ్చారు. షో లోపల ఎలాంటి సమస్యలు లేకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అటు శిల్పాకళా వేదిక చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే షోను అడ్డుకునేందుకు వచ్చిన 50 మంది బీజేపీ, బీజేవైఏం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మునావర్, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు నినాదాలు చేశారు.  

మునావర్ షోకు అనుమతివ్వడంపై ఫైర్..
హిందూ దేవుళ్లను కించపరుస్తాడని షారుఖీపై ఆరోపణలు ఉండటంతో హిందూ సంఘాల నేతలు షోను ఆపివేయాలని శుక్రవారం నుంచే హెచ్చరించారు. షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, BJYM నేతలు హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే రాజసింగ్ ని అరెస్ట్ చేసి లాలగూడా పీఎస్ కి తరలించారు. రాజాసింగ్, బీజేవైఎం నేతలు హెచ్చరించినా..కామెడీ షో కి శుక్రవారం మాదాపూర్ పోలీసులు అనుమతిచ్చారు. షో కు  పోలీసులు అనుమతి  ఇవ్వడంపై  బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. 

శిల్పకళా వేదిక వద్ద ఉద్రిక్తత..

శనివారం సాయంత్రం షో ను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున BJP, BJYM కార్యకర్తలు తరలిరావడంతో శిల్పాకళా వేదిక దగ్గర హై టెన్షన్ ఏర్పడింది. షోను అడ్డుకునేందుకు మరికొందరూ బీజేపీ నేతలు SOT పోలీసుల డ్రెస్సుల్లో వచ్చారు. శిల్పకళావేదిక మూడు ఎంట్రన్స్ ల నుంచి నిరసనకారులు దూసుకెళ్లారు. దీంతో వచ్చిన వారిని వచ్చినట్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 50 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి..మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అరెస్టులపై నేతలు మండిపడ్డారు. సీతమ్మ తల్లిని అవమానించిన మునావర్ ఫారూఖీని రాష్ట్రానికి ఎలా రప్పిస్తారని ఫైర్ అయ్యారు. గతంలో ఇతర సిటీల్లో హిందూ దేవుళ్లను అవమానించేలా మునావర్ స్టాండప్ కామెడి షో చేశారన్నారు.