అగ్నిప్రమాద స్థలానికి సీఎం కేజ్రీవాల్..

అగ్నిప్రమాద స్థలానికి సీఎం కేజ్రీవాల్..

ఢిల్లీ : దేశ రాజధానిలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 27 మంది అక్కడికక్కడే సజీవదహనం కాగా.. 12 మంది గాయపడిన సంగతి తెలిసిందే. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. గాయపడిన వారికి సంజయ్ గాంధీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందచేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇద్దరిని గుర్తించారు. 2022, మే 14వ తేదీ శనివారం ఉదయం అగ్నిప్రమాద ఘటన ప్రాంతానికి సీఎం కేజ్రీవాల్ చేరుకున్నారు.

అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు పరిహారం అందచేస్తామని ప్రకటించారు. మృతులు, తప్పిపోయిన వారిని గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. బాధిత కుటుంబాల కోసం ఆసుపత్రి వద్ద హెల్ప డెస్క్ ఏర్పాటు చేశారు. డీఎన్ఏ లతో మృతదేహాలను గుర్తిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. 

అసలేం జరిగింది ? 
ఢిల్లీలోని పశ్చిమ  ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని  నాలుగంతస్తుల వాణిజ్య భవనం ఉంది. ఈ భవనంలో శుక్రవారం సాయంత్రం మంటలు  చెలరేగాయి. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ప్రమాద సమాచారం అందినట్లు తెలిపారు ఢిల్లీ చీఫ్  ఫైర్ సర్వీస్ ఆఫీసర్ అతుల్ గార్గ్.  పోలీసులు, అగ్నిమాపక  సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలుచేపట్టాయి.  30కి పైగా ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. 27 మంది సజీవదహనం అయ్యారు. ఫస్ట్ ఫ్లోర్‌‌లోని సీసీటీవీ కెమెరాలు, రూటర్ తయారీ కంపెనీల్లో మంటలు చెలరేగాయని..  అక్కడి నుంచి  భవనమంతా వ్యాపించినట్లు ఢిల్లీ చీఫ్  ఫైర్ సర్వీస్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. బిల్డింగ్ అంతా పొగ నిండిపోవడంతో.. అందులోని  వారంతా తీవ్ర భయాందోళనకు  గురయ్యారు. ప్రాణభయంతో.. మొదటి, రెండు అంతస్తుల్లోని అద్దాల కిటికీలు పగులగొట్టి  పై నుంచి కిందకు  దూకారు. మరికొందరు  తాళ్ల సాయంతో కిందికి దిగారు. 

మరిన్ని వార్తల కోసం : 

ముంబై నుంచి ఢిల్లీకి మకాం మార్చిన నవనీత్ రానా

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..27 మంది సజీవదహనం