బీఆర్​ఎస్​ కౌన్సిలర్​పై చర్యలు తీసుకోవాలె

బీఆర్​ఎస్​ కౌన్సిలర్​పై చర్యలు తీసుకోవాలె

కోల్​బెల్ట్, వెలుగు : క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వార్డు బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ పారిపెల్లి తిరుపతి తమను  అకారణంగా దూషించి, బెదిరింపులకు పాల్పడ్డంటూ మున్సిపల్​ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. సోమవారం తెల్లవారుజామున మున్సిపల్​ ఆఫీస్​ వద్ద కౌన్సిలర్​ తీరును నిరసిస్తూ   కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా పలువురు   కార్మికులు మాట్లాడుతూ..

ఆదివారం తొమ్మిదో వార్డులో  ప్రజల వద్దకు వెళ్లి హోలీ పండుగ సందర్భంగా  డొనేషన్స్​ ఆడుగుతుండగా వార్డు బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ పారిపెల్లి తిరుపతి తమపై నోటికొచ్చినట్లు అసభ్యపదజాలతో  తిట్టాడన్నారు. బెదిరిస్తూ తమను కొట్టేందుకు వచ్చాడని ఆరోపించారు.  

సపాయి పనులు చేసే తమపై దౌర్జన్యం చేసేందుకు వచ్చిన కౌన్సిలర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని, బేషరత్తుగా కౌన్సిలర్​  క్షమాపణలు చెప్పాలని కార్మికుడు డిమాండ్​ చేశారు. నిరసన కార్యక్రమంలో మహేందర్, తిరుపతి, దేవవరం, రాజు, శ్రీనివాస్, శంకర్, సురేశ్​, రాజాలింగు తదితరులు పాల్గొన్నారు.