- నేడే మున్సిపోల్స్ రిజల్ట్స్
- తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
- మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు
- కౌంటింగ్ సెంటర్ల వద్ద ముమ్మర ఏర్పాట్లు
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కొన్ని గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుండడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఉమ్మడి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు, సీపీ, ఎస్పీ ఆధ్వర్యంలో కౌంటింగ్ సెంటర్ల వద్ద ఏర్పాట్లతోపాటు భారీ బందోబస్తు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పాలిటెక్నిక్ బాయ్స్ కాలేజీ, బోధన్‌లో విజయమేరీ స్కూల్, ఆర్మూర్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, భీంగల్‌లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. కామారెడ్డి జిల్లాలో జిల్లా పోలీస్ ఆఫీస్ సమీపంలోని మార్కెట్ కమిటీ గోడౌన్, బాన్సువాడ డిగ్రీ కాలేజీ, ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ, బిచ్‌కుంద మార్కెట్‌యార్డులో కౌంటింగ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు, ఏజెంట్లకు ప్రత్యేక పాస్‌లు జారీ చేసి ఉదయం 7 గంటల్లోపు హాజరుకావాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారి తప్ప ఇతరులకు సెల్‌ఫోన్ అనుమతి లేదు. కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్ సూపర్వైజర్స్, సపోర్టింగ్ స్టాఫ్ ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు.
నిజామాబాద్ జిల్లాలో ..
నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీల్లో పోటీ చేసిన 729 మంది అభ్యర్థుల తలరాతలు తేలనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి, అనంతరం బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు లెక్కిస్తారు. నిజామాబాద్ నగర పాలక సంస్థలోని 60 డివిజన్లకు 60 టేబుళ్లు ఏర్పాటు చేశారు. బోధన్‌లో 38, ఆర్మూర్‌లో 36, భీంగల్‌లో 12 టేబుళ్ల వద్ద లెక్కింపు జరుగుతుంది. ప్రతి వెయ్యి ఓట్లను ఒక రౌండ్‌గా పరిగణించి ఫలితాలు ప్రకటిస్తారు. నగర పాలక సంస్థ పరిధిలోని కొన్ని డివిజన్లలో నాలుగు వేలకు పైగా ఓట్లు నమోదవడంతో నాలుగు రౌండ్ల వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. మున్సిపాలిటీల్లో ఒకటి లేదా రెండు రౌండ్లలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. జిల్లాలో 93 మంది సర్వీస్ ఓటర్ల పోస్టల్ బ్యాలెట్లతో పాటు పోలింగ్ సిబ్బంది వినియోగించిన 2,273 పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. అనంతరం 3,06,697 సాధారణ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వీటిలో బోధన్‌కు 47,645, ఆర్మూర్‌కు 43,499, భీంగల్‌కు 9,800 ఓట్లు ఉన్నాయి.
కామారెడ్డి జిల్లాలో ..
కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్‌కుంద మున్సిపాలిటీల్లోని 92 వార్డుల్లో 447 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నాలుగు కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమై, 11 గంటలకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా రెండు విడతల్లో కౌంటింగ్ జరుగుతుంది. మొదటి విడతలో 32, రెండో విడతలో 17 వార్డుల ఓట్ల లెక్కింపు ఉంటుంది. బాన్సువాడ (19), ఎల్లారెడ్డి (12), బిచ్‌కుంద (12) మున్సిపాలిటీల్లో ఒకే విడతలో కౌంటింగ్ పూర్తవుతుంది. టేబుల్‌కు సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు. 261 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఏర్పాట్లను పరిశీలించారు.
నగరంలో ట్రాఫిక్ డైవర్షన్
నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలో 5 కిలోమీటర్ల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. విజయోత్సవ ర్యాలీలు, పటాకులు కాల్చడం, సభలు, మైక్‌లు నిషేధించామని సీపీ సాయిచైతన్య తెలిపారు. ఆర్మూర్, హైదరాబాద్ నుంచి వచ్చే బస్‌లు ఇతర వెహికల్స్ కంఠేశ్వర్ బైపాస్, కలెక్టరేట్, కాలూర్ జంక్షన్ మీదుగా నగరంలోకి
ఎంటర్ కానున్నాయి.
కౌంటింగ్ ప్రక్రియ ఇలా..
ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి, అనంతరం పోలింగ్ స్టేషన్ల వారీగా బ్యాలెట్ బాక్సులు తెరిచి 25 చొప్పున బ్యాలెట్ పేపర్స్ బండిల్స్ కట్టి ప్రాథమిక లెక్కింపు చేస్తారు. పోలైన ఓట్ల సంఖ్యతో సరిపోల్చిన తర్వాత అన్ని బండిల్స్‌ను కలిపి వెయ్యి చొప్పున రౌండ్లుగా లెక్కిస్తారు. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే రీ-కౌంటింగ్ నిర్వహిస్తారు. అయినా సమానంగా ఉంటే డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని కొన్ని డివిజన్లలో 4 వేలకు మించి ఓట్లు పోలయ్యాయి. కావున నాలుగు రౌండ్ల తరువాతే రిజల్ట్వెలువడుతుంది.
