- టికెట్ఖాయమంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ఆశావహులు
- ఇప్పటికే వార్డుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ బీజేపీ నేతల హడావుడి
- అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్, రిజర్వుడ్స్థానాల్లో మజ్లిస్ ప్రచారం
- రిజర్వేషన్లు కలిసిరాక పలువురి లీడర్ల ఆశలు ఆవిరి
నిజామాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థుల కోసం సర్వే నిర్వహిస్తున్నాయి. దీంతో బరిలో నిలవాలనుకునే కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ప్రజలు కోరుకున్న అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్అధిష్టానం స్పష్టం చేస్తోంది. సర్వేలో తమ పేరు ఉంటుందో లేదోనన్న ఆందోళన నేతల్లో పెరుగుతోంది. రిజర్వేషన్ల రొటేషన్ అనుకూలించక ఇప్పటికే పలువురు నేతల ఆశలు ఆవిరయ్యాయి. దీంతో కొందరు పక్క డివిజన్‌లు, వార్డులపై దృష్టి సారిస్తున్నారు.
మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో భార్యలు, కోడళ్లను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. అనుకూల రిజర్వేషన్ వచ్చిన చోట తమకే టికెట్ ఖాయమని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. పోటీ చేయాలనుకునే బీజేపీ నేతలు ఇప్పటికే వార్డుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ హడావుడి చేస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. ఎలక్షన్ షెడ్యూల్‌కు ముందే కొన్ని డివిజన్లలో మజ్లిస్ ప్రచారం ప్రారంభించింది. కాగా జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ వార్డుల్లో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో దింపాలని మజ్లిస్ ప్లాన్ చేస్తోంది.
ఇందూర్, ఆర్మూర్‌పై బీజేపీ ఫోకస్..
పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నగరపాలక సంస్థ, ఆర్మూర్ మున్సిపాలిటీలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. క్యాండిడేట్ల ఎంపికను సీరియస్‌గా తీసుకుని ముఖ్య నేతల సర్వేల ద్వారా ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు. టికెట్ దక్కే అవకాశంలేని నేతలకు ముందుగానే సంకేతాలు ఇస్తున్నారు. రిజర్వేషన్ల కారణంగా స్థానాలు మారిన వారికి పార్టీ అండగా ఉంటుందని లోకల్ క్యాడర్‌కు స్పష్టం చేశారు. తాము పోటీలో ఉన్నట్లు తెలియజేసేందుకు ఆశావహులు వార్డుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
రిజర్వుడ్ స్థానాలపై మజ్లిస్ కసరత్తు..
నగరపాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లు ఉండగా, గత ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 16 డివిజన్లు గెలుచుకుంది. బోధన్‌లోని 38 వార్డుల్లో 11 మంది కౌన్సిలర్లను గెలిపించింది. మైనారిటీ ఓట్లతో గెలిచే స్థానాల్లో క్యాండిడేట్ల ఎంపికను ఇప్పటికే పూర్తి చేసింది. బీజేపీని దెబ్బతీసి మరిన్ని స్థానాలు గెలుచుకునే వ్యూహంలో భాగంగా ఎస్సీ రిజర్వుడ్ వార్డుల్లో నాన్‌మైనారిటీలను బరిలోకి దింపేందుకు కసరత్తు చేపట్టింది. పార్టీకి మళ్లీ జోష్ తెచ్చేందుకు బోధన్ నుంచి తన భార్య అయేషా ఫాతిమాను బరిలోకి దించాలనే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ ఉన్నట్లు సమాచారం. భీంగల్ బల్దియాను లోకల్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సవాల్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
సర్వే కీలకమేనంటున్న కాంగ్రెస్..
డీసీసీ అధ్యక్షుల ఎంపిక నుంచే కాంగ్రెస్ హైకమాండ్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జిల్లా నాయకుల సిఫారసుల పాత ట్రెండ్‌కు చెక్ పెట్టి, కార్యకర్తలు కోరుకునే అభ్యర్థుల ఎంపికకు ఏఐసీసీ ఇన్‌చార్జిలను రంగంలోకి దించింది. మున్సిపల్ ఎన్నికల్లో పైరవీలకు తావులేకుండా సర్వేల ద్వారానే సమర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో సర్వే కొనసాగుతోంది. ముగ్గురి పేర్లను సిఫారసు చేసే ఈ లిస్ట్‌లో తమ పేరు ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ మేయర్, చైర్‌పర్సన్ పదవులు ఆశిస్తున్న నేతల్లో మరింతగా
కనిపిస్తోంది.
