మున్సిపల్ ఎన్నికల్లో చివరి రోజు 20 వేలకు పైగా నామినేషన్లు!

మున్సిపల్ ఎన్నికల్లో చివరి రోజు 20 వేలకు పైగా నామినేషన్లు!
  •     మున్సిపల్​ ఎన్నికల్లో పోటీకి  పోటెత్తిన అభ్యర్థులు
  •     కిటకిటలాడిన నామినేషన్​ కేంద్రాలు
  •     నేటి నుంచి నామినేషన్ల విత్​ డ్రా

హైదరాబాద్​, వెలుగు: మున్సిపల్​ ఎన్నికల్లో  పోటీకి  అభ్యర్థులు పోటెత్తారు. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన శుక్రవారం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏకంగా 20 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు, నేతలు, పార్టీల కార్యకర్తల రాకతో నామినేషన్​ కేంద్రాలన్నీ కిటకిటలాడాయి.  డప్పు చప్పుళ్లు, కోలాటాల నడుమ పార్టీ జెండాలతో ఊరేగింపుగా రావడంతో అన్నిచోట్లా సందడి నెలకొన్నది.  శుక్రవారం రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం  7 కార్పొరేషన్లలోని 414   డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,582   వార్డులకు 28,456 నామినేషన్లు వేశారు. 

శుక్రవారం అర్ధరాత్రి వరకు క్యూలైన్లు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.  శనివారం నుంచి ఫిబ్రవరి 3 వరకు నామినేషన్లను విత్​ డ్రా చేసుకోవచ్చు. శనివారం నామినేషన్ల పరిశీలన(స్క్రూటినీ) చేపట్టడానికి ఆఫీసర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వేయని నామినేషన్లను రిటర్నింగ్​ ఆఫీసర్లు తిరస్కరిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై వచ్చిన అప్పీళ్లపై  ఆదివారం విచారణ చేపడుతారు. 

నామినేషన్ కోసం రూ.7.51 కోట్ల చెల్లింపు.. 

నిజామాబాద్​ కార్పొరేషన్​లోని 19 డివిజన్ నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్​గా నామినేషన్ వేయడానికి కాటిపల్లి శమంత అనే అభ్యర్థి  రూ.7.51 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్​ చెల్లించాల్సి వచ్చింది.  నిజామాబాద్ కార్పొరేషన్​ పరిధిలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్​లో శమంత భాగస్వామిగా ఉన్నారు. ఇక్కడ జీప్లస్​ 5 ఫ్లోర్​లో నడుస్తున్న హోటల్​లో పన్నుల తేడాలు గుర్తించిన కార్పొరేషన్​ ఆఫీసర్లు పెనాల్టీ, వడ్డీ విధించారు. 

దీనిపై ఆమె హైకోర్టుకు వెళ్లగా రీ అసెస్​మెంట్​కు కోర్టు మార్చి 2025 లో ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో విధించిన ట్యాక్స్ ను క్రాస్ చెక్ చేసిన ఆఫీసర్లు  కలెక్టర్ ద్వారా సీడీఎంఏకు ఫైల్ పంపడానికి రెడీ అయ్యారు. ఇంతలోనే మున్సిపల్ ఎలక్షన్స్ రావడంతో రీ అసెస్​మెంట్​ అయ్యే దాకా తన నుంచి ట్యాక్స్ తీసుకోవద్దని నామినేషన్ వేయడానికి ‘నో డ్యూస్ సర్టిఫికెట్​’ ఇప్పించాలని శమంత మరోసారి కోర్టులో కేసు వేయగా జడ్జి అంగీకరించలేదు. దీంతో ఆమె రూ. 7.51 కోట్ల ట్యాక్స్ ను బ్యాంకు డీడీ గా ఇచ్చి నో డ్యూస్ సర్టిఫికెట్​తో 19 డివిజన్ నుంచి నామినేషన్ వేయడం విశేషం.

నో డ్యూస్​తో రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్​

మున్సిపల్​ ఎన్నికల్లో నామినేషన్​ వేయడానికి అభ్యర్థులు నో డ్యూస్​ సర్టిఫికెట్​ సమర్పించాలన్న షరతు ఉంది. దీంతో చాలా మంది పెండింగ్‌లోని డ్యూస్‌ను కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్​ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు రూ.50 కోట్లకు పైగా ట్యాక్స్​ వసూలైనట్లు సీడీఎంఏ ఆఫీసర్లు తెలిపారు.