సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చండూరు, వెలుగు : మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరులో మున్సిపల్ కార్మికులు నాలుగు నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొన్నిరోజుల నుంచి సమ్మె చేపట్టారు. ఎమ్మెల్యే హామీ మేరకు ఈనెల 9న కార్మికులు సమ్మె విరమించారు. గురువారం చండూరు మున్సిపాలిటీలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. రెండు నెలల జీతాలతోపాటు 9 నెలల పీఎఫ్ రావాలని కార్మికులు.. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీకి ఆదాయం పెంచుకొని కార్మికులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యేను కార్మికులు శాలువాతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మణికరణ్, వైస్ చైర్మన్ సుజాతావెంకటేశ్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి..

మునుగోడు, వెలుగు : ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. గురువారం మునుగోడు లో జరిగిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. పాఠశాలలో ఉన్న సమస్యలను  అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాపై అధికారులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామానికీ మంచినీటి సమస్య రాకుండా చూడాలని అధికారులకు సూచించారు.