అమిత్ షా గిమిత్ షాతో ఏమీ కాదు..మున్సిపాలిటీలు అన్నీ మనయే

అమిత్ షా గిమిత్ షాతో ఏమీ కాదు..మున్సిపాలిటీలు అన్నీ మనయే

ఒక్క సీటు ఓడినా మంత్రుల పదవులు ఊడుతయ్: ​కేసీఆర్​
సర్వేలన్నీ అనుకూలమే.. బీజేపీ ప్రభావం ఉండదు
అధికారం తలకెక్కొద్దు.. అహంకారం ఉండొద్దు
టికెట్ల పంపిణీ, రెబల్స్ బుజ్జగింపు బాధ్యత ఎమ్మెల్యేలదే
అమిత్ షా గిమిత్ షా వచ్చినా ఏమీ కాదు
కాంగ్రెస్ ఖాళీ అయింది.. అందులో ఉన్నది సన్నాసులే
సీఏఏకు ఎప్పుడూ సపోర్టు చేయం
లోక్​సభ ఎన్నికల్లో అతివిశ్వాసమే కొంప ముంచింది
అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో ఓటమికి హరీశే కారణం
మున్సిపోల్స్​పై నేతలకు సీఎం కేసీఆర్​ దిశానిర్దేశం
సుధీర్​రెడ్డితో గొడవపై మంత్రి మల్లారెడ్డికి క్లాస్!

నియోజకవర్గాల్లో మేమే.. మాకు ఎదురులేదు.. అనే తీరుగా ఉండొద్దు. అందరినీ కలుపుకొని పోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తయ్​. టీడీపీలో ఉన్న బాబూమోహన్ ను పార్టీలోకి పిలిచి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన. ఆయన గెలిచినంక ఎవరితో సరిగ్గా లేడు. దీంతో ఆయనకు 2018లో టికెట్ ఇవ్వలేదు. టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ. ఏ పార్టీకి మనం అనుకూలం కాదు. అట్లనే వ్యతిరేకం కూడా కాదు. అన్ని పార్టీలను టీఆర్ఎస్ సమానంగా చూస్తుంది.సీఏఏ విషయంలో పార్టీ వైఖరిని ఇప్పటికే చెప్పినం. ముస్లింలకు విరుద్దంగా ఆ చట్టం ఉంది. దానికి మనం ఎప్పుడూ
సపోర్టు చేయం.

హైదరాబాద్, వెలుగు: ‘‘మున్సిపల్​ ఎన్నికల్లో అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నయ్​. 120 మున్సిపాలిటీలు,10 మున్సిపల్ కార్పొరేషన్లలో మనదే విజయం” అని టీఆర్​ఎస్​ నేతలతో సీఎం కేసీఆర్​ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఉండదని, కాంగ్రెస్​ను పెద్దగా పట్టించుకోవద్దని సూచించారు. ఫలితాలు సరిగా లేకపోతే  పర్యవసనాలు ఉంటాయని హెచ్చరించారు. ఒక్క సీటు ఓడినా ఊరుకునేది లేదని, పదవులు ఊడుతాయని మంత్రులకు కేసీఆర్​ వార్నింగ్ ఇచ్చారు. జిల్లాల్లో నేతలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని, మంచీచెడులను చూసుకోవాలని, ఏ మున్సిపాలిటీలో ఏమవసరమున్నా వెంటనే ఆదుకోవాలని ఆదేశించారు. అధికారం తలకెక్కించుకోవద్దని, అహంకారంతో ఉండొద్దని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆయన హితవుపలికారు. మున్సిపల్ ఎన్నికలపై శనివారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్​ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్​పర్సన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ కార్యదర్శులు హాజరయ్యారు. మున్సిపోల్స్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుమారు గంటన్నర పాటు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.పార్టీ విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి.

ఆత్మీయ సమ్మేళనాలు పెట్టండి

పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్​ సూచించారు. నియోజకవర్గాల్లో పార్టీ కేడర్​తో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. కార్యకర్తల వల్లే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారాస్త్రాలుగా చేసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘టికెట్ ఇచ్చినంత మాత్రాన సరిపోదు. వాళ్లను గెలిపించుకోవాలి. రెబల్స్ ను బుజ్జగించండి. వారిని పోటీ నుంచి తప్పించేందుకు ఏం కావాలో చూడండి’’ అని ఆయన ఆదేశించారు.

విభేదాలు పక్కన పెట్టండి

కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్​ఎస్​లోకి వచ్చిన 12 మంది ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో వర్గపోరు ఉన్న విషయాన్ని సీఎం పరోక్షంగా ప్రస్తావించారు. ‘టికెట్ కోసం ఎదురుచూసేవారు ఎక్కువగా ఉంటారు. కాని ఎమ్మెల్యే సూచించిన వాళ్లే ఫైనల్. అందరూ కలిసి ఆ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలి. విభేదాలు పక్కన పెట్టాలి’ అని ఆదేశించారు. పాత, కొత్త నాయకులు సమన్వయంతో నడుచుకోవాలని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ లో ఉన్నది సన్నాసులే

కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని కేసీఆర్​ వ్యాఖ్యానించారు. ‘మనం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కాంగ్రెస్​ కేడర్ మనదగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నది సన్నాసులే. వాళ్లు ఏం చేయలేరు. ఆ పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవద్దు’ అని టీఆర్​ఎస్​ నేతలతో ఆయన సూచించారు.

అతివిశ్వాసం కొంపముంచింది

లోక్​సభ ఎన్నికల రిజల్ట్స్​ను సీఎం ప్రస్తావించారు. ‘16కు 16 సీట్లు గెలుస్తామని అతి విశ్వాసంతో పోయినం. దీంతో అనుకున్నన్ని సీట్లు రాలేదు’ అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ అతి విశ్వాసం సరికాదని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 25న ఎమ్మెల్సీలు అందరూ తెలంగాణ భవన్‌కు రావాలని ఆదేశించారు.  ఏ ఎమ్మెల్సీ ఏ మున్సిపాలిటీలో కో అప్షన్ మెంబర్ గా నమోదు చేసుకోవాలో పార్టీ సూచిస్తుందన్నారు. మంత్రి కేటీఆర్​ను మున్సిపల్​ ఎన్నికల ప్రచారానికి పంపాలని కొందరు నేతలు కోరగా.. అవసరమున్న చోటికి పంపిస్తానని కేసీఆర్​ తెలిపారు.

పువ్వాడను ఆపిన సెక్యూరిటీ సిబ్బంది

తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన మంత్రి పువ్వాడ అజయ్​ను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆపి తనిఖీ చేశారు. అంతకుముందు లోపలికి వెళ్లిన నాయకులెవరినీ చెక్ చేయలేదు. కేవలం తనను ఆపి తనిఖీ చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. సమావేశానికి  సెల్ ఫోన్ తో రావొద్దని ముందే అందరికీ తెలంగాణ భవన్ నుంచి సమాచారం వెళ్లింది. దీంతో మంత్రులు సైతం తమ సెల్​ఫోన్లను వ్యక్తిగత సిబ్బందికి అప్పగించి మీటింగ్​కు హాజరయ్యారు.

నేతలతో విడిగా కేటీఆర్​ భేటీ

సీఎంతో సమావేశం ముగిశాక టీఆర్​ఎస్​ వర్కింగ్  ప్రెసిడెంట్​ కేటీఆర్  ఉమ్మడి జిల్లాలవారీగా పార్టీ నాయకులతో విడిగా సమావేశమయ్యారు. మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చించారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను పెన్ డ్రైవ్ లో ఇచ్చారు. లబ్ధిదారుల వద్దకు వెళ్లి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరాలని నాయకులకు కేటీఆర్ ఆదేశించారు.

అమిత్ షా గిమిత్ షాతో ఏమీ కాదు

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఏమీ ఉండదు అని కేసీఆర్ అన్నారు. బీజేపీ బలం  పుంజుకోలేదని సర్వేల్లో తేలిందదని పేర్కొన్నారు.  ఇప్పటికే 4 సర్వేలు చేయించినా ఆ పార్టీ గ్రాఫ్ పెరగలేదని రిపోర్టులు చెపుతున్నాయన్నారు. ‘రాష్ట్రంలో బీజేపీ ఏదో చేయాలను కుంటున్నది. అమిత్ షా గిమిత్ షా వచ్చినా ఏం కాదు. మనల్ని ఎవరూ ఏం చేయలేరు’ అని టీఆర్​ఎస్​ నేతలతో  కేసీఆర్  పేర్కొన్నారు. బీజేపీతో పోటీ అనే అపోహ వద్దని, తమకు ఎవరితో పోటీ లేదని స్పష్టం చేశారు.