కోతులు పోతేనే ఓట్లేస్తాం

కోతులు పోతేనే ఓట్లేస్తాం

రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీల్లో కోతుల బెడదే మెయిన్ ఎలక్షన్ ఇష్యూగా మారింది. దగ్గర్లోని అడవుల నుంచి నగరాల బాట పట్టిన కోతులు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. దాంతో జనం కోతులంటేనే భయపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వస్తున్న పార్టీల నేతలు, అభ్యర్థులకు ఇదే సమస్యను చూపిస్తున్నారు జనం. కోతులను సిటీ దాటిస్తేనే పోలింగ్ కేంద్రాలకు వస్తామని చెబుతున్నారు.

కరీంనగర్ కార్పోరేషన్ తో పాటు పొరుగున్న ఉన్న గ్రామాల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా నగరాల మీద స్వైర విహారం చేస్తున్నాయి.  శివారుల్లో పంటలను నాశనం చేయడంతో పాటు… ఇళ్ళల్లోకి దూరుతున్నాయి. నగరంలోని భగత్ నగర్, రాంనగర్, సప్తగిరి కాలనీ, మంకమ్మతోట, జ్యోతినగర్ , అపోలో రీచ్ హాస్పిటల్ ఏరియాతో పాటు.. చాలా ప్రాంతాల్లో కోతులు హంగామా చేస్తున్నాయి.

హుజురాబాద్ మున్సిపాలిటీలోనూ కోతుల దాడులు కొనసాగుతున్నాయి. కరీంనగర్ శివారుల్లోని మానకొండూరు, తిమ్మాపూర్, పోరండ్ల, ఎల్ఎండీ లోనూ కోతుల సమస్య విపరీతంగా ఉందంటున్నారు స్థానికులు. అక్కడి నుంచే కోతులు సిటీలోకి వచ్చి.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయంటున్నారు. కోతుల సమస్య నుంచి విముక్తి కల్పించిన వారికే ఓటేస్తామని చెబుతున్నారు.

వరంగల్ జిల్లాలో దట్టమైన అడవులు ఉండేవి.  క్రమేపీ అవి తగ్గిపోతున్నాయి. వర్ధన్నపేట, పరకాల, జనగామ, తోర్రూరు, నర్సంపేట  మున్సిపాలిటీల పరిధిలో గుట్టల విధ్వంసం కొనసాగుతోంది. కంకర కోసం క్వారీలు ఏర్పాటు చేసి తవ్వేస్తున్నారు. దట్టమైన అడవులున్న జయశంకర్ భూపాలపల్లి, మహబూ బాబాద్ జిల్లాల్లో.. చెట్ల నరికి వేతతో కోతులు పట్టణాలకు చేరాయి. ఒకప్పుడు ఎలుగు బంట్లు, అడవి పందుల బెడదతో పంటలు నష్టపోయిన రైతులను ఇప్పుడు.. కోతులు ఇబ్బంది పెడుతున్నాయి. నగరంలో ఇళ్ల పైకి చేరిన పైకప్పులు పీకేస్తున్నాయి. కోతులు వెళ్లగొడతామని హామీ ఇస్తేనే.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేస్తామంటున్నారు వరంగల్ ఓటర్లు.

ఖమ్మం జిల్లాలోనూ కోతులు.. జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. వైరా మున్సిపాలిటీలో సమస్య తీవ్రంగా ఉందని చెబుతున్నారు స్థానికులు. ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోతున్నామంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు ప్రజలు. దీంతో అన్ని పార్టీల నేతలు కూడా.. కోతుల సమస్య తాము పరిష్కరిస్తామంటూ హామీ ఇస్తున్నారు.

నల్గొండ జిల్లాలోని చిట్యాల,నల్గొండ, దేవరకొండ, చౌటుప్పల్, నందికొండ, మిర్యాలగూడలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఇళ్లలోకి చొరబడి వస్తువులన్నీ చిందరవందర చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ కు వెళ్తున్న చిన్నారులపై దాడులకు తెగబడుతున్నాయి. అడవుల్లో వదిలేసి వచ్చినా.. మళ్లీ ఊళ్లోకి వస్తున్నాయని జనం చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోతులను తరిమేందుకు కొండెంగలను కూడా తీసుకొచ్చారు. అయినా సమస్య పరిష్కారం కావట్లేదు. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన నేతలను నిలదీస్తున్నారు ప్రజలు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కోతుల సమస్యే ప్రధానంగా వినిపిస్తోంది. నగరాల్లోకి ఎంటరవుతున్న కోతులతో జనం పరేషాన్ అవుతున్నారు.  మున్సిపల్ సిబ్బంది కోతులను బోనుల్లో బంధించి దగ్గర్లోని అడవుల్లోకి వదులుతున్నారు. అయినా మళ్ళీ అవి నగరాలపై దాడి చేస్తున్నాయి.  అడవుల్లో తినడానికి ఏవీ దొరక్కపోవడంతో… ఊళ్ళల్లోకి వస్తున్నాయంటున్నారు జనం. రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీల్లో ప్రచారానికి వస్తున్న అభ్యర్థులకు ఇదే సమస్యను వినిపిస్తున్నారు ఓటర్లు.

See Also:బైక్ పై హల్ చల్ చేసిన ఎమ్మెల్యే రోజా

See Also: సంకల్పమే ఆమెను గెలిపించింది: సర్పంచ్ గా 97 ఏళ్ల బామ్మ

See Also: పనిచేయకుంటే పదవులను ఊడదీస్తాం