మునుగోడు నియోజకవర్గ వివరాలపై ఈసీ ఆరా

మునుగోడు నియోజకవర్గ వివరాలపై ఈసీ ఆరా
  • సెప్టెంబర్ రెండో వారంలో షెడ్యూల్ వచ్చే చాన్స్
  • నియోజకవర్గ వివరాలపై ఈసీ ఆరా
  • ఈవీఎంలు, పోలింగ్ కేంద్రాలపై రిపోర్ట్​ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మునుగోడు బై ఎలక్షన్‌పై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది. నియోజకవర్గ   వివరాలపై ఆరా తీసింది. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, ఓటర్ల సంఖ్య, ప్రస్తుత పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వాలని నల్గొండ జిల్లా ఎన్నికల అధికారిని ఈసీ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు కలిపి మునుగోడుకు బై ఎలక్షన్ షెడ్యూల్‌ను సెప్టెంబర్ రెండో వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఆగస్టు 8న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అదే రోజు అసెంబ్లీ సెక్రటరీ మునుగోడు స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కూడా మునుగోడు సీటు వేకెంట్ ఉన్నట్లు ఈసీకి నివేదించారు. ఒక వేళ సెప్టెంబర్ రెండో వారంలో షెడ్యూల్ రిలీజ్ చేస్తే.. అక్టోబర్‌‌లో దసరా తర్వాత పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సీఈవో ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి.

మునుగోడు నియోజకవర్గంలో 6మండలాలు, 2మున్సిపాలిటీలు ఉండగా.. 2 లక్షల 27వేల 265 మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో 298 పోలింగ్‌‌ స్టేషన్లు వినియోగించుకున్నారు. ఈసారి 300కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈసీ ఆదేశాలతో ఈవీఎంలపై జిల్లా ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టింది. గతంలో వాడిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు ఎన్ని ఉన్నాయి, ఏదైనా నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికపై కోర్టు కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయా వంటి వాటిని సరిచూసుకుంటున్నది. యాదాద్రి జిల్లా నుంచి 190 బ్యాలెట్‌‌ యూనిట్లు, 351 కంట్రోల్‌‌ యూనిట్లు, 506 వీవీ ప్యాట్‌‌లు మునుగోడుకు చేరుకున్నాయి. ఇప్పటికే 1,002 బ్యాలెట్‌‌ యూనిట్లు, 245 కంట్రోల్‌‌ యూ నిట్లు, 90 వీవీప్యాట్‌‌లు బై ఎలక్షన్ కోసం రెడీ చేసుకున్నారు. 

జిల్లా అధికారులను సంప్రదించి..
వాస్తవానికి కరోనా వచ్చినప్పటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్రాల్లో, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలను తీసుకుని ఎలక్షన్స్ పెట్టింది. గత ఏడాది నవంబర్‌‌‌‌లో జరిగిన హుజూరాబాద్ బై ఎలక్షన్ విషయంలోనూ రాష్ట్ర సీఎస్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. అందులో భాగంగానే సెప్టెంబర్‌‌‌‌లో జరగాల్సిన ఎన్నికను నవంబర్‌‌‌‌లో నిర్వహించింది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోవడంతో నేరుగా సీఈఓ.. జిల్లా ఎన్నికల అధికారులను సంప్రదించి వివరాలు తీసుకుంటున్నారు. గుజరాత్, హిమచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే డిసెంబర్‌‌‌‌లో సాధారణ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వాటితో పెడితే ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. దీంతో అక్టోబర్‌‌‌‌లోనే మునుగోడు బైపోల్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.