బైపోల్ అనివార్యం

బైపోల్ అనివార్యం
  • గుజరాత్‌‌ అసెంబ్లీతో పాటే జరగొచ్చు
  • సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు
  • గెలిచి ప్రజల వ్యతిరేకత నుంచి బయటపడాలని టీఆర్ఎస్ వ్యూహాలు
  • హుజూరాబాద్‌‌ సీన్ రిపీట్ చేస్తామనే ధీమాతో బీజేపీ
  • కోలుకోలేని దెబ్బతో కాంగ్రెస్‌‌కు కష్టకాలం

హైదరాబాద్ : మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 18 నెలల గడువు ఉండటంతో మునుగోడుకు ఆరు నెలల్లోనే బైపోల్‌‌ జరిగే అవకాశాలున్నాయి. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటితోపాటే ఈ ఉప ఎన్నిక జరిగే చాన్స్ ఉండటంతో ప్రధాన పార్టీల్లో అప్పుడే రాజకీయ వేడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్​బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో హుజూరాబాద్ బై ఎలక్షన్ ఫలితాలే మునుగోడులో రిపీటయ్యే అవకాశాలున్నాయని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్‌‌గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజగోపాల్ వ్యూహాత్మక అడుగులు
కాంగ్రెస్‌‌కు, ఎమ్మెల్యే పదవికి తన రాజీనామా వ్యవహారంలో రాజగోపాల్‌‌రెడ్డి ఒకింత వ్యూహాత్మకంగా వ్యవహిరంచారు. కాంగ్రెస్ నాయకుల్లో ఎవరు తనను సంప్రదించినా వినేలా కనిపించకపోవడంతో ఢిల్లీలోని పార్టీ అధినాయకత్వం పరిస్థితిని సోమవారం లోతుగా పరిశీలించింది. ఇంత జరిగినా ఉపేక్షిస్తే బాగోదని, రాజగోపాల్‌‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని అధిష్టానానికి సీనియర్లు సిఫార్సు చేశారు. ఆయనపై వేటు నిర్ణయాన్ని 24 గంటల్లో ప్రకటించొచవచ్చని కథనాలు వచ్చిన నేపథ్యంలో రాజగోపాల్‌‌రెడ్డి వేగంగా  స్పందించారు. నియోజకవర్గంలో కూలంకషంగా అభిప్రాయాలు సేకరించి, 10 రోజుల తర్వాతా రాజీనామా చేయాలనుకున్న ఆయన.. సత్వర నిర్ణయానికి వచ్చారు. తనపై కాంగ్రెస్ చర్య తీసుకునే ఏ ఆస్కారం లేకుండా చేసుకున్నారు.

పార్టీలు రెడీ
ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే రెడీ అయ్యాయి. టీఆర్ఎస్ ఆరు నెలల నుంచే అందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నది. తమ పార్టీలోకి నేతలను చేర్చుకోవడం, అభ్యర్థి విషయంలో సర్వేలు చేయించుకోవడం కొనసాగిస్తున్నది. దుబ్బాక, హుజూరాబాద్‌‌లో తగిలిన ఎదురుదెబ్బల నుంచి బయటపడేందుకు మునుగోడు బై ఎలక్షన్ కోసం ఎదురుచూస్తున్నది. ఇక్కడ గెలిస్తే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి బయటపడుతామని ఆశిస్తున్నది. అందుకే మునుగోడుపై ముందస్తుగానే కన్నేసింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ.. మునుగోడు నుంచి తమ బలం చాటాలని అనుకుంటున్నది. దుబ్బాక, హుజూరాబాద్ తరహాలో మునుగోడును కైవసం చేసుకుంటే రాష్ట్రమంతటా ఓటు బ్యాంకు పెరుగుతుందని భావిస్తున్నది. మునుగోడుకు ఉప ఎన్నిక రాకుండా గండం గట్టెక్కాలని కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాజగోపాల్‌‌ పార్టీ వీడటంతో పెద్ద నష్టం జరిగిందని పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. నల్గొండలో రాజగోపాల్‌‌కు బలమైన పట్టు ఉండటంతో ఆ ప్రభావం జిల్లా అంతటా ఉంటుందని, మునుగోడులో ఆయనను ఎదుర్కోవటం అంత ఈజీ కాదని అంగీకరిస్తున్నారు.