ప్రజా తీర్పును శిరసావహిస్తం : బండి సంజయ్

ప్రజా తీర్పును శిరసావహిస్తం : బండి సంజయ్

మునుగోడుకు ఇచ్చిన హామీలను 15 రోజుల్లో అమలు చేయాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు. ఓడిపోయినా..గెలిచినా ప్రజల కోసమే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేవలం 11 వేల ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపొందారని.. నల్గొండలో బీజేపీ లేదన్న వారు ఈ ఫలితాన్ని చూసైనా వాస్తవాన్ని గ్రహించాలని  సూచించారు.తమ పార్టీ కార్యకర్తలు ఎక్కడా నిరుత్సాహానికి గురి కాలేదన్నారు. దాడులు జరిగినా..బీజేపీ భయపడలేదన్నారు.  రాష్ట్రంలో మరో 12 చోట్ల ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమా  అని  సంజయ్ సవాల్ విసిరారు. 

ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి ఓ రకంగా యుద్ధం చేశారని.. ప్రజల కోసం ఆయన తపనపడుతారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ వాళ్లు ఓటుకు రూ. 5 వేలు ఇవ్వడంతో పాటు.. భారీగా మద్యం పంచారని ఆరోపించారు. టీఆర్ఎస్ కు సంబంధించిన డబ్బులను పోలీసులు  పట్టుకోలేదని ఆరోపించారు.  కాంగ్రెస్ పేరిట టీఆర్ఎస్ డబ్బులు పంచిందని.. ఇదంతా చూస్తున్న జనం నవ్వుకుంటున్నారన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.   టీఆర్ఎస్ అరాచకాలను అడ్డుకొనే పార్టీ బీజేపీయేనని ప్రజలు గుర్తించారని...అందుకే ఆశీర్వదిస్తున్నారని చెప్పారు.