మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సారథి.. ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ తనను కోవర్ట్ అనటానికి కేటీఆర్ కు సిగ్గు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుమని పది ఎకరాలు లేని కేటీఆర్ కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. కేటీఆర్ ఢిల్లీకి కోవర్టువు కాదని ..ఒట్టేసి చెప్పే దమ్ము, ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అవినీతి కుంభకోణాలకు కేటీఆర్ కోవర్టు అని ఆరోపించారు.
కేటీఆర్ ఢిల్లీకి కోవర్టు కాకుంటే ఎప్పుడో జైల్లో ఊచలు లెక్కబెట్టేవారని కోమటిరెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంతో పాటు ప్రతి ప్రాజెక్ట్ లోనూ కల్వకుంట్ల ఫ్యామిలీకి కమీషన్లు వెళ్తున్నమాట నిజం కాదా అని ప్రశ్నించారు. తాను నిజాయితీతో నిప్పులా జీవిస్తున్నానన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి..కేసీఆర్ కుటుంబంలా కమీషన్లతో బతకడం లేదన్నారు. రాజకీయమంటే.. .. అప్పనంగా అధికారం అనుభవిస్తూ వేల కోట్ల అవినీతి చేయడం కాదన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల ఆత్మలు ఘోషిస్తుంటే ..విదేశీ పర్యటనల్లో కేటీఆర్ఎంజాయ్ చేయడం సమంజసం కాదన్నారు.
కేటీఆర్ భాష,పద్ధతి బాగాలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చదివింది అమెరికాలోనా..! గుంటూరు గల్లీల్లోనా..? అంటూ ప్రశ్నించారు. అసలు తెలంగాణ ఎలా వచ్చిందో కేటీఆర్ కు తెలుసా అని నిలదీశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రిగా ఉన్నతమైన హోదాను.. గడ్డిపోచలా వదిలేశానని చెప్పారు. తాను చేపట్టిన ఉద్యమం ఉప్పెనై రగిలితే.. తెలంగాణ వచ్చిందనే విషయం తెలియకుంటే కేటీఆర్ అడిగి తెలుసుకోవాలన్నారు.
