
- బీఆర్ఎస్ పోతేనే హైదరాబాద్ డెవలప్ అయితదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే హైదరాబాద్ నాశనం అవుతుందని మంత్రి హరీశ్ రావు అనడం సరికాదని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గోత్రాలు ఒకటే అని విమర్శించారు. మంత్రి హరీశ్ కామెంట్లపై ఎన్నికల సంఘం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మురళీధర్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘హరీశ్ రావు, ఆయన మామ పుట్టక ముందు నుంచే హైదరాబాద్ సిటీ ఉంది. నిజాం కన్నా ముందు నుంచీ హైదరాబాద్ ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడు దొంగలు. ఆ రెండు పార్టీల గోత్రాలూ ఒకటే. టీఆర్ఎస్ పుట్టుకకు.. హైదరాబాద్ సిటీకి ఎలాంటి సంబంధం లేదు”అని మురళీధర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజలు కష్టపడితేనే సిటీ ఈ స్థాయికి చేరిందన్నారు.
టాలీవుడ్ సినిమాలకు హైదరాబాద్ కేరాఫ్ అని, అందులో బీఆర్ఎస్ పాత్ర ఏముందని ప్రశ్నించారు. జెనరిక్ మెడిసిన్, వ్యాక్సిన్ ఉత్పత్తిలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు. దీనికి బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ను గద్దె దించితేనే.. హైదరాబాద్ డెవలప్ అవుతుందని అన్నారు. సిటీలో ఆలయ భూములు, చెరువులు, కుంటల కబ్జాకు కేసీఆర్ ప్రభుత్వమే కారణమన్నారు. హమాస్ టెర్రరిస్ట్‌లకు మద్దతుగా ర్యాలీ తీస్తే బీఆర్ఎస్ సపోర్ట్ చేయడంపై మండిపడ్డారు. హమాస్‌కు సపోర్ట్ చేస్తున్న అసదుద్దీన్ పాలస్తీనాకు వెళ్లి మద్దతు ప్రకటించాలన్నారు.