సికింద్రాబాద్, వెలుగు : వచ్చే 25 ఏండ్లు దేశానికి చాలా కీలకమని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం చారిత్రాత్మక వేగంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మోదీ దార్శనికతతో 2047 నాటికి దేశం అభివృద్ధి చెందినదిగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రోజ్ గార్ మేళా స్కీమ్ కింద కొత్తగా చేరిన ఒక లక్షకుపైగా రిక్రూట్లకు నియామక పత్రాలను సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ అందజేశారు.
సికింద్రాబాద్లోని జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ(ఎన్ఐఎస్ఏ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి మురుగన్ హాజరై హైదరాబాద్ లో కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల్లో చేరిన వారు తమను ఉన్నతులుగా తీర్చిదిద్దుకుంటూ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. చాంద్రాయణగుట్టలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) గ్రూప్ సెంటర్ లో జరిగిన మరో ప్రోగ్రామ్ లో మరో కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రంలో కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.
