
హైదరాబాద్‌సిటీ, వెలుగు: కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. హిమాయత్‌సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో.. చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జిల వద్ద మూసీ ఉధృతంగా ప్రవాహిస్తున్నది. ముఖ్యంగా మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వరద బ్రిడ్జిని ఆనుకుని ప్రవహిస్తుండడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.
దిల్సుఖ్నగర్ నుంచి అంబర్‌పేట వైపు వెళ్లే వాహనదారులను గోల్నాక మీదుగా దారి మళ్లిస్తున్నారు. జియాగూడ 100 ఫీట్ల రోడ్డును సైతం తాత్కాలికంగా మూసివేశారు. సోమవారం రాత్రి హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి మూసీలోకి 3,960 క్యూసెక్కుల నీటిని వదిలిన అధికారులు.. మంగళవారం సాయంత్రం నాటికి ఒక గేటు ఒక అడుగు మేరకు ఎత్తి నీటిని వదులుతున్నారు. మూసారాంబాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు హెచ్చరించారు.