ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రాజన్న ఆలయం అభివృద్ధి

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రాజన్న ఆలయం అభివృద్ధి
  • ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి పనులు
  • మొదటి దశలో రూ.111 కోట్లతో ప్రధాన ఆలయ విస్తరణ పనులు
  • 35.25 కోట్లతో అన్నదాన సత్ర భవన నిర్మాణం 
  • రూ.47.86 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు
  • భక్తులకు అందుబాటులోకి రానున్న అన్ని వసతులు 

వేములవాడ, వెలుగు: ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయం మరింత సుందరంగా రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే ప్రధాన ఆలయ విస్తరణ పనులతోపాటు టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యాయి. వేములవాడ టెంపుల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథారిటీ(వీటీడీఏ) ఆధ్వర్యంలో అన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆగమ శాస్త్రానుసారం ఆలయ పనులు చేపడుతున్నారు. 

ఆలయ అభివృద్ధి పనులను  మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, వీటీడీఏ వైస్ చైర్మన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షిస్తున్నారు.  కాగా గతంలో పీసీసీ హోదాలో రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పర్యటించిన సమయంలో ఆలయ అభివృద్ధికి మాటిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్డు విస్తరణ పనులకు గత నవంబర్ 20న శంకుస్థాపన చేశారు.    

ఆకర్షణీయంగా మహా మండపం, గోపురాలు

రాజన్న ఆలయం అభివృద్ధికి మొదటి దశలో రూ.111 కోట్లను ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ నిధులతో మహా మండపం, నిత్య కల్యాణ మండపం, ధర్మగుండం పునరుద్ధరణ, కొత్త రాజ గోపురాలు నిర్మిస్తున్నారు. యాత్రికుల సౌకర్యార్థం విశాల ప్రాకారాలు, ప్రత్యేక క్యూ లైన్లు కూడా సిద్ధమవుతున్నాయి. దీంతోపాటు గుడి చెరువు ఘాట్ అభివృద్ధి, బండ్ సుందరీకరణ, మల్టీ లెవెల్ పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థలాలను అభివృద్ధి చేయనున్నారు. 

ఆలయం వద్ద రూ. 25 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. వీటితోపాటు రాజన్న భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​, విప్​ఆది శ్రీనివాస్​ చొరవతో రూ. 35.25 కోట్లతో అన్న దానసత్ర భవనం నిర్మాణం చేపడుతున్నారు. దీనిలో ఒకేసారి వెయ్యి మంది భోజనం చేసేలా డైనింగ్ హాల్, 600 మందికి వెయిటింగ్ హాల్, లడ్డూ తయారీ కేంద్రం, ఆధునిక వంట శాలలు నిర్మించనున్నారు. 

భీమేశ్వర ఆలయంలో దర్శనాలు 

ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ కళాభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధికారులు కూల్చివేశారు. కల్యాణ కట్ట, ఈవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాళీ చేసి కూల్చివేయనున్నారు. రాజన్న ఆలయంలో విస్తరణ పనులు కొనసాగుతుండడంతో భక్తుల  దర్శనాల కోసం రాజన్న అనుబంధ భీమేశ్వర ఆలయంలో విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులకు రూ.10 కోట్లు కేటాయించారు. రూ. 3.44 కోట్లతో కల్యాణ మండపం, హోమ, వ్రత మండపం, షెడ్ నిర్మాణం, క్యూ లైన్లు, సీసీ ఫ్లోరింగ్ పనులు కొనసాగుతున్నాయి. 

దశాబ్దాల కల రాజన్న ఆలయ రోడ్డు విస్తరణ 

వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి ప్రధాన ఆలయం వరకు ఇప్పుడున్న 40 ఫీట్ల రోడ్డును 80 ఫీట్ల రోడ్డుగా నిర్మిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ. 47.86 కోట్లు మంజూరు చేసింది. రోడ్డు విస్తరణలో ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెక్కులు ఇప్పటికే అందజేసి కూల్చివేతలు కూడా పూర్తిచేశారు. ఇటీవల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 6.56 కోట్లతో మూలవాగు మూడో బ్రిడ్జి పనులు మొదలయ్యాయి. దీంతో భక్తులు, పట్టణ వాసులకు ట్రాఫిక్ కష్టాలు దూరం కానున్నాయి.

సీఎం కృషితో రాజన్న ఆలయం అభివృద్ది

సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రత్యేక కృషితో రాజన్న భక్తుల కష్టాలు తీరనున్నాయి. నాటి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజన్న ఆలయానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. రాజన్న భక్తుల కష్టాలు, ఈ ప్రాంత సమస్యలను వివరించడంతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నవంబర్​ 20న ఆలయ అభివృద్ధితోపాటు టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం పనులకు శంకుస్థాపన చేశారు. శృంగేరి పీఠాధిపతులు, వాస్తు పండితులు, ప్రముఖుల సలహాలు, సూచనలు మేరకు రాజన్న ఆలయాన్ని విస్తరిస్తున్నాం. భక్తులకు సులభంగా వేగంగా దర్శనం కల్పిస్తాం. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అధికారులకు ప్రత్యేక కృతజ్జతలు.-ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే