
ఇళయరాజా (Ilaiyaraaja)..ఈ పేరు తలవకుండా ఇండియన్ సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడటం చాలా కష్టం. తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేశారు. ఇప్పటికే 1400 వందలకు పైగా సినిమాలకు సంగీతం అందించి రికార్డ్ క్రియేట్ చేశారు ఈ సంగీత జ్ఞాని. స్వరమాంత్రికుడు ఇళయరాజా భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సంగీతకారులలో ఒకరు.
ఇళయరాజా భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ రారాజు. సంగీతాభిమానులను ఉర్రూతలూగించే పాటలు, మనసుదోచే మెలోడీలు అందించిన సంగీత బ్రహ్మ. ఆయన చేసినన్ని వెరైటీలు, సూపర్ హిట్ పాటలు ఎవరూ కంపోజ్ చేయలేదు. ఎంతోమంది ప్రతిభావంతులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఐతే.. తనకు క్రెడిట్ ఇవ్వకుండా.. అనుమతి లేకుండా.. తనకు ప్రతిఫలం ఇవ్వకుండా తన పాటలను వాడుకోవడాన్నీ తీవ్రంగా తప్పుపడుతున్నారు ఇళయరాజా.
ఇదిలా ఉంటే ..తాను మ్యూజిక్ అందించిన పాటలను వాడుకునే ఒప్పంద గడువు పూర్తి అయ్యిందని..ఏకో రికార్డింగ్(Echo Recording) వంటి పెద్ద సంస్థలపై ఇళయరాజా కాపీ హక్కులను కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. దీంతో ఆ సంస్థలు కూడా చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ ను దాఖలు చేసారు.
తాజాగా ఈ కేసును విచారించిన మద్రాసు హైకోర్టు ఇళయరాజా పాటలను ఉపయోగించుకునే హక్కు ఆ రికార్డింగ్ సంస్థలకు ఉందని తీర్పును ఇచ్చింది .అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఇళయరాజా తరఫున న్యాయవాది మరో పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఈ నెల ఏప్రిల్ 10న న్యాయమూర్తులు ఆర్.మహాదేవన్ మరియు మహ్మద్ షఫీక్ సమక్షంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది.ఈ సందర్భంగా ఇళయరాజా తరఫు న్యాయవాది వాదిస్తూ.."ఇళయరాజా గారు అందరికంటే ఎంతో గొప్పవారని వాదించారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు చాలా ప్రజాదరణ పొందాయని అన్నారు. ఆ వాదనకు జస్టిస్ ఆర్.మహాదేవన్ కల్పించుకుని ‘సంగీత త్రిమూర్తులు’గా పేరుపొందిన సంగీత దర్శకులు అయిన..'ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజర్, శ్యామశాస్త్రి' వీరు అందరికంటే గొప్పవారని తెలియజేసారు.
ఇళయరాజా గారు వారికంటే గొప్పవారేమీ కాదని తెలిపారు. మీ వాదనను మేము అస్సలు అంగీకరించలేము’ అని న్యాయమూర్తులు అన్నారు.దీనితో ఈ కేసు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.దీంతో వచ్చే వాదనలతో ఎలాంటి నిర్ణయం రాబోతుందని కోలీవుడ్ నాట హాట్ టాపిక్ గా మారింది