
సురేశ్ బొబ్బిలి.. ఈ పేరు వినంగనే మనిషి యాదికి రాకపోవచ్చు. కానీ, ఈ తెలంగాణ పిలగాడు కంపోజ్ చేసిన‘కోలు కోలమ్మా.. కోలు కోలు నా సామి..’ పాట మాత్రం అందరి నోట్లో ఆడుతోంది. ఏండ్ల సంది పల్లెల్లో వినిపిస్తున్న ఈ జానపదానికి ‘విరాటపర్వం’ సినిమాలో కొత్తరూపం ఇచ్చిండు ఈ మ్యూజిక్ డైరెక్టర్. మనసుని హత్తుకునేలా ట్యూన్స్ కట్టి ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నడు. సౌండ్ ఇంజినీర్‌గా కెరీర్ షురూ చేసి, బ్యాక్ గ్రౌండ్ స్కోరర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ మ్యుజీషియన్ మ్యూజికల్ జర్నీయే ఇది..
పాటంటే ప్రాణం. అందుకే.. పాట కోసం బడిని పక్కనపెట్టిండు సురేశ్ బొబ్బిలి. పుట్టి, పెరిగిన ఊరికి దూరంగ సిటీకొచ్చిండు. పాటని అంటిపెట్టుకుని ఉండనీకి రికార్డింగ్ స్టూడియోలో ఆఫీసు బాయ్గ చేరిండు. అవకాశాల్ని వెతుక్కుంట కిలోమీటర్లు నడిచిండు. చివరాఖరికి అనుకున్నది సాధించిండు. ‘‘నా ప్రతి సినిమాకి కథని బట్టే మ్యూజిక్ చేస్త. ఎక్కడా కావాల్నని పాటలు ఇరికించను’’ అంటున్నడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.
డిగ్రీ పేరుచెప్పి సిటీకొచ్చిన
‘‘మా సొంతూరు మహబూబాబాద్ జిల్లాలోని గౌరారం. మా అమ్మ కాంతమ్మ. ఆమె నోటెంట వచ్చే జానపదాలంటే మా ఊరంతా చెవికోసుకుంటది. బాయి కాడ అమ్మ పాట అందుకుంటే నాట్లు, కోతలు పొద్దు తెలియకుండనే పూర్తయ్యేటివి. మా బాపు శంభయ్య ఫ్లూటు వాయించెటోడు. స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. మా అన్న నరిరాజ్ కూడా పాటలు పాడతడు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి అన్న మా పక్క ఊళ్లోనే ఉండెటోడు. చుట్టూ ఇంతమంది మ్యుజీషియన్లుంటే చదువు మీద మనసు ఎట్ల నిలుస్తది. కానీ, బడికి పోనంటే ఇంట్లో ఊరుకోరు. అందుకే మా ఊళ్లోని గవర్నమెంట్ బడిలో ఐదో క్లాస్ వరకు చదువుకున్న. ఆ తర్వాత మహబూబాబాద్‌లోని గవర్నమెంట్ హాస్టల్లో ఉండుకుంట టెన్త్ పూర్తి చేసిన. అప్పటికే మా అన్న చక్రి ‘సాహితి కళాభారతి’ ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతుండెటోడు. ఇంటర్ చదువుకుంట నేను కూడా ఆ ట్రూప్‌లో చేరిన. నా ఇంటర్ పూర్తయ్యే టైంకి చక్రి అన్న సిటీకొచ్చి మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నడు. మా అన్న కూడా సినిమా ప్రయత్నాలు మొదలుబెట్టిండు. వాళ్లని ఇన్స్పిరేషన్గ తీస్కొని నేను కూడా హైదరాబాద్ రావాల్ననుకున్న. వరంగల్‌లోని ‘పోతన’ మ్యూజిక్ కాలేజీలో హిందూస్తానీ మ్యూజిక్ నేర్చుకుని సిటీ బాట పట్టిన. డిగ్రీ సాకుతో సిటీకొచ్చి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టిన.
అన్న స్టూడియోలో.. ఆఫీసు బాయ్గ
పార్ట్ టైం జాబ్ చేసుకుంట డిగ్రీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిన. ఆ తర్వాత చదువుకన్న మ్యూజిక్ ముఖ్యమనిపించి ఇటు వైపు వచ్చిన. అప్పటికే అన్న దోస్తులతో కలిసి రికార్డింగ్ స్టూడియో పెట్టిండు. కొన్ని చిన్న సినిమాలకి మ్యూజిక్ కూడా చేస్తుండు. దాంతో అన్నకాడికి పోయి ‘నీతో కలిసి స్టూడియోలోనే ఉంటన’ని చెప్పిన. కానీ, ‘ఎక్స్ట్రా ఖర్చు ఎందుక’ని మిగతా పార్ట్నర్స్ వద్దన్నరు. దాంతో అదే స్టూడియోలో ఆఫీసు బాయ్గ పనికి కుదిరిన. అక్కడికి వచ్చిపోయే క్లైంట్లకి ‘ఇది మా అన్న స్టూడియో’ అని ఎప్పుడూ చెప్పకపోయేటోడ్ని. దాంతో చానామంది ఆఫీస్‌బాయ్ అని చులకనగ చూసెటోళ్లు. అయినా వెనక్కి తగ్గలే.. ఉద్యోగం చేసుకుంట ఖాళీ దొరికినప్పుడల్లా సౌండ్ ఇంజినీరింగ్ నేర్చుకున్న. ఆర్నెల్లలోనే పర్ఫెక్ట్ అయిన. యూట్యూబ్‌లో వీడియోలో చూసుకుంట మ్యూజిక్ ప్రోగ్రామింగ్, మిక్సింగ్ ఎట్ల చేయాలి? కీ బోర్డు ఎట్ల వాడాలో నేర్చుకున్న. కానీ, నిరూపించుకోనీకి అవకాశాలు లేవు. పైగా స్టూడియోలో జీతం ఇచ్చేటోళ్లు కాదు. దాంతో ఖర్చులకి అన్న హెల్ప్ చేసినా ఇబ్బంది అయ్యేటిది. చానాసార్లు ఫిల్మ్ నగర్ నుంచి కృష్ణానగర్, మణికొండ నడుచుకుంట పోయిన. సినిమా ఆఫీసులకి కూడా నడిచెళ్లేటోడ్ని. అది వాళ్లకి తెలియకుండ ఆఫీసుకి కొంచెం ముందు ఆగి డ్రెస్ సరిచేసుకుంట ఆటో దిగినట్టు బిల్డప్ ఇచ్చెటోడ్ని. ఆఫీసులోనికి వెళ్లంగనే చానామంది చెప్పుల నుంచి జుట్టు వరకు స్కాన్ చేసేటోళ్లు. నా అప్పియరెన్స్ చూసి, నా వర్క్‌ని కాలిక్యులేట్ చేసేటోళ్లు. అది చానా బాధనిపించేటిది.
వీ6 గుర్తింపునిచ్చింది
తెలంగాణ పాటల్ని కొత్తగ ప్రజెంట్ చేయాల్నన్న ఆలోచన చిన్నప్పట్నించి ఉండేటిది. అందుకే తెలంగాణ మూమెంట్ టైంలో తెలంగాణ పాటల కలర్ మార్చుతూ కొన్ని ట్యూన్స్ కట్టిన. వాటిని తీసుకుని వీ6 ఛానెల్ సీఈవో అంకం రవిగారిని కలిస్తే వెంటనే ఓకే చేసిన్రు. అలా వీ6తో కలిసి నేను చేసిన ‘నన్ను గన్న తల్లి నా జన్మభూమి’ పాట సూపర్ హిట్ అయింది. తెలంగాణ అనౌన్స్మెంట్కి ముందే ఆ పాట రిలీజ్ అవడంతో ప్రపంచమంతా ఆ పాట దిక్కే చూసింది. ఆ తర్వాత వీ6లో రిలీజ్ అయిన మొదటి బతుకమ్మ పాట కంపోజ్ చేసిన. ఆ పాటతోనే బతుకమ్మ పాటల కల్చర్ షురూ అయింది. ఆ వెంటనే వీ6లో చేసిన బతుకమ్మ , బోనాల పాటలు నన్ను జనాలకి మరింత దగ్గర చేసినయ్. నా లైఫ్‌ని పూర్తిగా మార్చేసినయ్. వీ6 వల్లే నాకు సినిమా అవకాశాలు కూడా వచ్చినయ్.
టెస్ట్ చేసి అవకాశమిచ్చిన్రు
ఒకరోజు యాడ్ కంపోజిషన్ కోసం డైరెక్టర్ వేణు ఉడుగుల స్టూడియోకి వచ్చిండు. ఆ యాడ్ మిక్సింగ్ నేనే చేస్తున్న. ఆ టైంలోనే నా పని చూసి ‘నీకు పాడటం వచ్చా?’ అని అడిగిండు వేణు. పాడి వినిపించిన. ‘కంపోజింగ్ వచ్చా?’ అని అడిగిండు మళ్లా. నేను చేసిన కొన్ని ట్యూన్స్ వినిపించిన. ఆ వెంటనే ‘నేనొక సినిమా చేస్తున్నా. అవకాశం ఇస్తే హ్యాండిల్ చేయగలవా?’ అని అడిగిండు. అప్పటికే వాళ్లొక ఎక్స్పీరియెన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్ని అనుకున్నరు. కానీ, నేనేమో ఇండస్ట్రీకి కొత్త. దాంతో డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఇచ్చి టెస్ట్ చేసిన్రు. అన్నింట్లో పాస్ అవడంతో ‘నాదీ నీది ఒకటే కథ’ సినిమాకి ఫైనల్ చేసిన్రు. కానీ, బడ్జెట్ లేక సినిమా కొంచెం లేటు అయింది. ఆ లోపే నేను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి అవకాశాలు పెరిగినయ్. ‘నీది నాది ఒకే కథ’ పాటలు హిట్ అవడంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా ఛాన్సులు వచ్చినయ్.
ఆ ఎఫెక్ట్ పడింది
‘జార్జి రెడ్డి’, ‘తోలు బొమ్మలాట’, ‘తిప్పరా మీసం’, ‘అక్షర’ ‘ముగ్గురు మొనగాళ్లు’.. ఇట్ల నేను చేసిన సినిమాలన్నింటికీ మ్యూజిక్ పరంగా మంచి మార్కులే పడినయ్. ‘పేపర్ బాయ్’, ‘ ప్లే బ్యాక్’, ‘తుపాకి’ లాంటి చానా సినిమాలకి సౌండ్ ఇంజినీర్‌గా కూడా చేసిన. కానీ, సినిమాలు ఆడకపోవడం నా కెరీర్‌కి మైనస్ అయింది. ఆ వెలితిని ‘ విరాట పర్వం’ పూడ్చుతుందని బలంగ నమ్ముతున్న. ఈ సినిమా కోసం మూడేళ్ల నుంచి కష్టపడుతున్న. హీరో, హీరోయిన్లు ఫైనల్ కాకముందు నుంచే ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న. ఈ సినిమా కోసం రూరల్ ఏరియాలకెళ్లి పాటలు కలెక్ట్ చేసిన. వాటి నుంచి ఇన్స్పైర్ అయి కొత్త ట్యూన్స్ కట్టిన. ఇప్పటికే రిలీజ్ అయిన ‘కోలు కోలు.. ’ పాట మంచిగ జనాల్లోకి వెళ్లింది. ఈ సినిమాలో పద్యాలు కూడా ఉంటయ్. సినిమాలో రానాతో ఒక పాట పాడించిన. అయితే ఈ మధ్య విరాటపర్వం నుంచి నేను తప్పుకున్నాననే రూమర్స్ బాధపెట్టాయి.
ఆ సలహాలు ఇబ్బంది పెడతయ్
వంద కోట్లు పెట్టి సినిమా తీస్తరు. కానీ, సినిమా మెయిన్ పిల్లరైన మ్యూజిక్‌కి పది లక్షల బడ్జెట్ ఇస్తరు. అట్లనే ట్యూన్స్ డైరెక్టర్‌కి నచ్చితే సరిపోతది. కానీ, అసలు సంబంధమే లేనోళ్లు వేళ్లు పెడతరు. ప్రొడ్యూసర్ వాళ్ల కొడుకొస్తడు. బావ వస్తడు. ‘మ్యూజిక్ అట్ల చెయ్యి, ఇట్ల చెయ్యి’ అని సలహాలు ఇస్తరు. సినిమా ఏం కోరుకుంటుందో నాకు, డైరెక్టర్‌కి తెలుస్తది. అయినా మ్యూజిక్ నేర్చుకున్నది నేను. అలాంటిది నన్ను పక్కనపెట్టి సినిమాలో ఎలాంటి మ్యూజిక్ ఉండాలో వాళ్లు ఎట్ల డిసైడ్ చేస్తరో అర్థం కాదు. ఇంకొందరైతే ఏకంగా కొన్ని పాటల క్లిప్పింగ్స్ బ్యాంకింగ్ పెట్టుకుంటరు. వాటిని కాస్త అటుఇటు మార్చమని అడుగుతరు. ఈ సమస్యలన్నీ దాదాపుగా అందరి మ్యూజిక్ డైరెక్టర్లకి ఉండేవే. అయితే, అందరూ ఇట్లనే ఉంటరని నేను చెప్పను.
ఆ లోటు తీర్చలేనిది
నేను ఇండస్ట్రీకి రాకముందే అమ్మ చనిపోయింది. నా ఫస్ట్ సినిమా రిలీజ్‌కి ముందే నాన్న కూడా చనిపోయిన్రు. నా సక్సెస్ చూడకుండనే వెళ్లిపోయారన్న బాధ ఎప్పటికీ ఉంటది. కానీ, ఆ బాధలోనే ఉండిపోతే వాళ్లు తిరిగిరారు. అందుకే కెరీర్‌పైనే ఫోకస్ అంతా పెట్టిన. ఎప్పుడైనా బాధనిపిస్తే ఊరెళ్లి వాళ్ల గుర్తుల్లో గడుపుతా” అని చెప్పిండు సురేశ్ బొబ్బిలి.
నా పాటలు ప్లస్ అవ్వాలి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కన్నా పాటలు చేయడమే తేలిక అనిపిస్తది నాకు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి భుజం లెక్క..అది ఎప్పుడూ సీన్‌ని పదింతలు లేపేటట్లు ఉండాలే తప్ప సీన్‌ని పడేసేలా ఉండకూడదు. అందుకే ఎక్కువ వర్కవుట్ చేయాల్సి ఉంటది. కానీ, పాటలకొచ్చే సరికి సిచ్యుయేషన్ చెప్పంగనే ట్యూన్ వచ్చేస్తది చానాసార్లు. ఫ్యూచర్లో చిన్నా, పెద్దా అని లేకుండ మంచి కథలకి మ్యూజిక్ చేయాలనుకుంటన్న. సినిమాని లిఫ్ట్ చేసేలా నా మ్యూజిక్ ఉండాలనుకుంటన్న.
::: ఆవుల యమున