అఖండ సక్సెస్ గ్యారంటీ.. ఆయన ఎనర్జీ వేరే లెవెల్

అఖండ సక్సెస్ గ్యారంటీ.. ఆయన ఎనర్జీ వేరే లెవెల్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ చిత్రం డిసెంబర్‌‌ 2న రిలీజవుతోంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. రాజమౌళి, అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజమౌళి మాట్లాడుతూ ‘అఖండ  సినిమాతో ఇండస్ట్రీకి ఓ ఊపు తెప్పించినందుకు బోయపాటికి థ్యాంక్స్. డిసెంబర్ 2 నుంచి థియేటర్స్ అన్నీ నిండిపోయి.. అరుపులు, కేకలతో దద్దరిల్లిపోతాయి. బాలయ్య బాబు ఒక ఆటమ్ బాంబ్. ఆ బాంబ్‌ని ఎలా ప్రయోగించాలో శ్రీనుకు తెలుసు. ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా’ అన్నారు. తమన్ మాట్లాడుతూ ‘ఇండస్ట్రీకి శివుడి లాంటి మనిషి బాలయ్య. తన స్పిరిచ్యువల్ ఎనర్జీని మాకూ ఇచ్చారు. ఇందులో మాస్ సాంగ్స్ చేసే స్కోప్ లేదు. ‘జై బాలయ్య’ పాట ఒక్కటే ఉంటుంది. అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందన్నాడు గెస్ట్​గా వచ్చిన గోపీచంద్ మలినేని. ఇదొక ఎపిక్ మూవీ అంది ప్రగ్యా జైస్వాల్. తనకు అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పిన పూర్ణ.. బాలకృష్ణ తనకు గాడ్ ఫాదర్ లాంటి వారని చెప్పింది. తమ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు నిర్మాత మిర్యాల రవీందర్‌‌రెడ్డి. 

బోయపాటి మాట్లాడుతూ ‘బాలయ్య ఫ్యాన్స్‌ గుండెల మీద చేయి వేసుకుని హాయిగా ఈ సినిమా చూడొచ్చు. 21 నెలల పాటు ఓపిగ్గా ఉన్నందుకు నిర్మాతకి థ్యాంక్స్. తమన్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో బాలయ్య ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంటుంది. జై బాలయ్య సాంగ్ ప్రాక్టీస్‌ టైమ్‌లో ఆయనకి గాయమయ్యింది. కోటిన్నర ఖర్చుతో సెట్ వేశాం. ఉదయం షూట్ చేయాలి. ఎలా అని ఆలోచిస్తే ఫ్యాన్స్ కోసం చేయాల్సిందే అన్నారాయన. అదీ బాలయ్య బాబుకి అభిమానులపై ఉన్న ప్రేమ. నేను డైరెక్టర్ అవ్వడానికి నాకు హెల్ప్ చేసిన వ్యక్తి బన్నీ . ఇంత ఎత్తుకి ఎదిగింది బాలయ్య వల్ల. వాళ్లిద్దరూ ఒకే స్టేజ్‌ మీద ఉండటం హ్యాపీగా ఉంది. నేను గెలవాలనుకుని ‘అఖండ’ తీయలేదు.. సినిమాయే గెలవాలని తీశాను. సినిమాని గెలిపించండి’ అన్నాడు. టీమ్ అంతా పాల్గొన్నారు.

చిన్న సినిమాలనూ ఆదరించండి: బాలకృష్ణ

సింహా, లెజెండ్ సినిమాల తర్వాత మా కాంబోలో వస్తున్న ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. పరమేశ్వరుడి ఆశీర్వాదంతో ఈ సినిమా వస్తోంది. అందుకే ఇది బాలకృష్ణ సినిమా, బోయపాటి సినిమా అని మేం అనుకోవడం లేదు. ఇలాంటి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో అందరూ మంచి క్యారెక్టర్స్​లో నటించారు. కష్టపడి పని చేసిన టీమ్‌ మొత్తానికీ థ్యాంక్స్. నేను జయాపజయాలకు గర్వపడను, కుంగిపోను. ఏ సినిమాకైనా ఒకేలా కష్టపడతాను. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసేవాడేగా నటుడంటే! ముందు ముందు మరిన్ని డిఫరెంట్ పాత్రలు పోషిస్తాను. నెక్స్ట్‌ గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడితో సినిమాలు చేస్తున్నాను. త్వరలో రానున్న పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా ఆదరించండి. ఇండస్ట్రీకి కావాల్సిన సహాయ సహకారాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని  కోరుకుంటున్నాను. 

బాలయ్య నా ఫాదర్ ఫిగర్‌‌: అల్లు అర్జున్

నందమూరి ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. మా తాతయ్య అల్లు రామలింగయ్య, ఎన్టీఆర్‌‌ గారి కాలం నాటిది. మేమంతా చిరంజీవి, బాలకృష్ణ గార్ల సినిమాలు చూస్తూ పెరిగాం. అలాంటిది ఇవాళ ఆయన ఫంక్షన్‌కి నేను రావడం ఆనందంగా ఉంది. వయసులో కాకపోయినా సీనియారిటీలో బాలయ్య నా ఫాదర్ ఫిగర్‌. బోయపాటి శ్రీను తన ఫస్ట్ మూవీ ‘భద్ర’ స్టోరీ మొదట నాకే చెప్పారు. అప్పటికే నేను ‘ఆర్య’కి కమిటవడం వల్ల చేయలేకపోయాను. కానీ తర్వాత నాకు ‘సరైనోడు’ లాంటి మంచి సినిమా ఇచ్చారు. మనతో పాటు ప్రయాణం మొదలు పెట్టిన వ్యక్తి ఇవాళ ఈ స్థాయిలో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక బోయపాటి, బాలకృష్ణల కాంబో గురించి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. సింహాతో స్టార్ట్ చేసి, లెజెండ్‌తో పెరిగి, అఖండతో అన్‌స్టాపబుల్‌గా సాగుతోంది వారి జోడీ. బాలకృష్ణ గారు ఈ పొజిషన్‌లో ఉండటానికి కారణం.. సినిమా అంటే ఉన్న అడిక్షన్. ఆయన డైలాగ్ డిక్షన్. రెండు, మూడు పేజీల డైలాగ్స్​ని కూడా మొదట్నుంచి లాస్ట్ వరకు అంతే ఎనర్జిటిక్‌గా చెప్పడం ఆయనకే చెల్లింది. తెరమీదైనా, బయటైనా ఆయన రియల్‌గానే ఉండటం ఆయన గొప్పదనం. నాకెంతో ఇష్టమైన ఆయన సినిమా తప్పకుండా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నాను. సెకెండ్ లాక్‌డౌన్ తర్వాత తెలుగులో వస్తున్న మొదటి పెద్ద సినిమా ఇది. పరిశ్రమ మొత్తానికీ ఇది ‘అఖండ’ జ్యోతిలా వెలుగునిస్తుందని నమ్ముతున్నాను.